గోల భరించలేక టీజర్ డేట్ ఇచ్చారు

తమిళ ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఓ సినిమా కోసం వెర్రెత్తిపోయి ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. దాని గురించే రకరకాల డిమాండ్లు. గొడవలు. ఆ సినిమా విడుదల విషయంలో కూడా ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. మాస్టర్.

ప్రస్తుతం తమిళంలోనే కాదు.. సౌత్ ఇండియా మొత్తంలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘మాస్టర్’ ఒకటి. గత కొన్నేళ్లలో విజయ్ ఇంతింతై అన్నట్లు ఎలా ఎదిగిపోయాడో.. ఎలా ఫాలోయింగ్, మార్కెట్, బాక్సాఫీస్ రేంజ్ పెంచుకున్నాడో తెలిసిందే. ప్రస్తుతం రజినీని మించిన రేంజ్ అతడిది. అాలాంటి హీరోతో ‘ఖైదీ’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన లోకేష్ కనకరాజ్ జట్టు కట్టడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా లేకుంటే ఏప్రిల్లో తమిళ నూతన సంవత్సరాదికే ఈ సినిమా రావాల్సింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడింది.

మధ్యలో ‘మాస్టర్’ నిర్మాతలు ఓటీటీ ఆఫర్లకు టెంప్ట్ అయిపోయినట్లుగా వార్తలొచ్చాయి. ఐతే ఈ సినిమాను అలా రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. నిర్మాతలకు ఆ ఉద్దేశం ఉందో లేదో కానీ.. తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. కాగా విడుదల మరీ ఆలస్యమవుతుండటంతో సినిమా నుంచి ఏదో ఒక విశేషాన్ని చూపించాలని అభిమానులు కొన్ని రోజులుగా గోల గోల చేస్తున్నారు. ‘మాస్టర్ అప్ డేట్ ఇవ్వాల్సిందే’ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

వాళ్ల గొడవ భరించలేక ఎట్టకేలకు టీజర్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం. దీపావళి కానుకగా శనివారం సాయంత్రం 6 గంటలకు ‘మాస్టర్’ టీజర్ రాబోతోంది. మామూలుగా ప్రతి దీపావళికీ తన కొత్త సినిమాను రెడీ చేస్తుంటాడు విజయ్. ఈసారి సినిమా రెడీగా ఉన్నా రిలీజ్ చేయలేని పరిస్థితి. దీంతో టీజర్‌ సెలబ్రేషన్ చేయబోతున్నారు. అది కూడా అభిమానులకు ఆనందాన్నిచ్చేదే. విజయ్ చివరి సినిమా ‘బిగిల్’ను అందించిన మహేష్ కోనేరునే ఈ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు.