OTT రంగానికి పాకిన కాపీ రైట్ మరకలు

కథల చౌర్యం టాలీవుడ్ కు కొత్త కాదు. ఒకరు రాసింది మరొకరు వాడుకుని ఒరిజినల్ రైటర్ కి క్రెడిట్స్ ఇవ్వకుండా సొమ్ములు చేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కొన్ని బయట పడ్డాయి. కొన్ని లోలోపల సెటిల్ మెంట్లతో రచ్చ కాకుండా ఆగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది హీరోలు, దర్శకులకు ఇది అనుభవమే. ఇప్పుడీ మరకలు ఓటిటికి చేరుకున్నాయి. ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కి ప్లాన్ చేసుకున్న జీ 5 వెబ్ సిరీస్ విరాటపాలెం కథా కమామీషు తాము నిర్మాణంలో పెట్టిన కానిస్టేబుల్ కనకందే అంటూ ఈటీవీ విన్ బృందం దాని విడుదలను ఆపాలని కోర్టుకు వెళ్లడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

విరాటపాలెం ట్రైలర్ చూశాకే తమకు కంటెంట్ అర్థమయ్యిందని, గతంలో ఇదే సంస్థకు కానిస్టేబుల్ కనకం దర్శకుడు కథ చెప్పాడని, మెయిల్స్ పంపిన ప్రూఫ్స్ ఉన్నాయని ఈటివి టీమ్ చెబుతోంది. నిజానికి జీ5 పేరు కానీ, ఆ సిరీస్ పేర్లు కానీ ప్రస్తావించకపోయినా ప్రెస్ మీట్ లో చూపించిన టీజర్ ని బట్టి అది దేని గురించో సులభంగా అర్థమైపోయింది. తాము సంప్రదించాలని ప్రయత్నిస్తే సదరు విరాటపాలెం సభ్యులు స్పందించడం లేదని, దీని మీద సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్లేందుకు కూడా సిద్ధమని ఈటీవీ ప్రకటించడం చూస్తే మ్యాటర్ ఇక్కడితో ఆగకుండా చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్ కమింగ్ రచయితలు దర్శకులు ఎవరికైన నెరేషన్ ఇస్తున్నప్పుడు లేదా ఇచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది తర్వాతి విషయం. కానీ ఈలోగా బాధితులు పడే మానసిక సంఘర్షణ మాములుగా ఉండదు. పైగా కోర్టులు, లాయర్లు, ఖర్చులు ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన ఈ క్రియేటివిటీ చౌర్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. జీ5 తరఫున ఎలాంటి వెర్షన్ వస్తుందో చూడాలి. అప్పుడు కాని ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఇంకొంచెం మెరుగ్గా అర్థమవ్వచ్చు.