వేకప్ కాల్… వార్ 2 మేలుకోవాలి

ఇంకో యాభై రోజుల్లో వార్ 2 విడుదల కానుంది. ఇప్పటిదాకా టీజర్ తప్ప యష్ రాజ్ ఫిలింస్ ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. దానికొచ్చిన మిశ్రమ స్పందన టీమ్ ని ఖంగారు పెట్టిన మాట వాస్తవం. అందుకే ఫైనల్ వెర్షన్ లో ఎలాంటి విమర్శలు రాకుండా మళ్ళీ రివైజ్ చేస్తున్న టాక్ ముంబై మీడియాలో ఉంది. ఇంకా అసలైన పాట చిత్రీకరించాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వచ్చే ఈ సాంగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. వచ్చే నెల మొదటి రెండు వారాల్లో దీన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చే విధంగా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆగస్ట్ 14న కూలితో తలపడేందుకు వార్ 2కి ఇప్పుడున్న బలం సరిపోదు. ఒకపక్క కూలి థియేటర్ హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు దాదాపు యుద్ధం చేసినంత పని చేస్తున్నాయి. ఎగ్జిబిటర్లు కూడా విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా బజ్ ఉందంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే. ముఖ్యంగా ఈ సినిమాని మాస్ కి చేరువ చేయాలి. దానికి స్ట్రాంగ్ పబ్లిసిటీ అవసరం. స్టయిలిష్ యాక్షన్ ఉన్నంత మాత్రాన మనోళ్లు ఎగబడిపోరు. స్టార్ పవర్ తో పాటు కంటెంట్ కూడా ముఖ్యమే. అది ఎంత మోతాదులో ఉందనేది ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషించనుంది.

ఇకపై వార్ 2 చేయబోయే స్ట్రాటజీ తెలుగు వెర్షన్ వరకు జూనియర్ ఎన్టీఆర్ ని ఫోకస్ చేసుకునే జరగాలి. అప్పుడే కామన్ ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవుతారు. ఆర్ఆర్ఆర్ లాగా దీనికి దర్శకుడి బ్రాండ్ లేదు. అయాన్ ముఖర్జీ అంటే సగటు జనాలకు తెలిసింది తక్కువ. బ్రహ్మాస్త్ర తీసి ఉండొచ్చు కానీ అవగాహన లేమి వల్ల తన పేరు మార్కెటింగ్ కి ఉపయోగపడదు. పైగా కూలికి రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, అనిరుధ్ రవిచందర్ ఇలా అందరూ తలో చేయి వేసి హైప్ పెంచుతున్నారు. కానీ వార్ 2 భారం ముందు తారక్ ఆపై హృతిక్ మీదే ఉంది. సో వేకప్ కాల్ అందుకుని స్పీడ్ పెంచాల్సిందే.