కుబేర సక్సెస్ మీట్ లో ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి రావడం వెనుక బ్యాక్ స్టోరీ గెస్టుగా వచ్చిన చిరంజీవి మాటల్లో తెలిసొచ్చింది. 1988లో హైదరాబాద్ రోడ్ల మీద స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్ లో వేలాది అభిమానులు పోగయ్యేవారు. వాళ్ళను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడేవారు. ఆ టైంలో గుంపులో ఉన్న శేఖర్ కమ్ములని చూసి చిరు దగ్గరికి రమ్మని పిలిచారు. ఆనందంతో ఉబ్బితబ్బిబు అయిపోయిన శేఖర్ ఆ క్షణమే తను ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నారు. హైటుగా ఉన్నాడని చిరంజీవి పిలిస్తే దాన్ని శేఖర్ పర్సనల్ పిలుపుగా ఫీలయ్యారు.
యువకుడిగా ఉన్న శేఖర్ కమ్ములకు ఈ అనుభవం గొప్ప ఇన్స్ పిరేషన్ గా నిలిచింది. ఇదంతా కుబేర స్టేజి మీద చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అంతే కాదు తను తీసిన ఆనంద్, గోదావరి, ఫిదా సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు గుర్తు పెట్టుకుని మరీ వాటి గొప్పదనాన్ని వివరించిన తీరు ఆశ్చర్యపరిచింది. 25 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల తీసింది పది సినిమాలే అయినా తన సిద్ధాంతాలకు కట్టుబడి,మంచి కంటెంట్ ఇవ్వాలనే తపనతో ఈ స్థాయికి రావడం వెనుక తాను ఉండటం గర్వంగా ఉందని చిరంజీవి చెప్పడం ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు అందుకునేలా చేసింది.
శేఖర్ కమ్ముల సైతం ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలనే ఆకాంక్షని వెలిబుచ్చడం గమనార్హం. నిజానికి కాంబోని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. లీడర్ తరహాలో సీరియస్ డ్రామాలు ఈ కలయికకు బాగుంటాయి. కాకపోతే అంత ఈజీగా కార్యాచరణలోకి రావు. తాను ఎంతగానో అభిమానించే చిరంజీవికి కథ రాయాలంటే శేఖర్ కమ్ములకు పెద్ద సవాల్ అవుతుంది. అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మెగాస్టార్ ని చూపించడం ఒక రకంగా రిస్క్ లాంటిది. ఇప్పటికిపుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates