నిన్న అర్ధరాత్రి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా జన నాయకుడు టీజర్ విడుదల చేశారు. పెద్దగా కంటెంట్ రివీల్ చేయలేదు కానీ, ఖాకీ దుస్తుల్లో స్టయిలిష్ గా నడుచుకుంటూ వచ్చి కత్తితో మీసాలు మెలేసే షాట్ మాత్రం చూపించి నిమిషంలోపే ముగించారు. తేరి తర్వాత విజయ్ పోలీస్ దుస్తుల్లో కనిపిస్తోంది ఈ సినిమాలోనే. అయితే దీంతోనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ముందు నుంచి జన నాయకుడు భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో నటుడు విటి గణేష్ దీని గురించే బాంబు పేల్చినంత పని చేసి టీమ్ ని ఖంగారు పెట్టాడు.
కానీ తమిళ మీడియా, నిర్మాణ సంస్థ పిఆర్ ప్రతినిధులు దీన్ని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ వచ్చారు. ఒక పాయింట్ మాత్రమే తీసుకుని పూర్తిగా కొత్త కథ రాసుకున్నారనే కథనాలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడీ జన నాయకుడు టీజర్ లో విజయ్ ఖాకీ దుస్తులు చూస్తుంటే భగవంత్ కేసరిలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడం సహజం. అంతే ఇది రీమేకనే సందేహాలు మరింత బలపడ్డాయి. క్యాస్టింగ్ పరంగా చూస్తే హీరోయిన్ పూజా హెగ్డే కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రను తమిళంలో మమిత బైజుతో చేయిస్తున్నారనే లీక్ ముందు నుంచే ఉంది. సో అంత తేలిగ్గా రీమేక్ వార్తలను కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది.
ఒకవేళ జన నాయకుడు నిజంగానే భగవంత్ కేసరి రీమేక్ అయినా కాకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. ఎందుకంటే విజయ్ స్టార్ డం ముందు అదసలు మ్యాటరే కాదు. ఆ మాటకొస్తే విజయ్ కాంత్ క్షత్రియుడుని అటుఇటు మార్చి తేరిగా తీస్తే రికార్డులు బద్దలయ్యాయి. చిరంజీవి మాస్టర్, కమల్ హాసన్ ప్రొఫెసర్ విశ్వంని మిక్స్ చేస్తే విజయ్ మాస్టర్ అదిరిపోయే హిట్టు కొట్టింది. సో ఇప్పుడు జన నాయకుడు ఏం చేస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చేశాడు కనక ఇది తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీ ఎత్తున రావడం ఖాయం. వచ్చే ఏడాది జనవరి 9 జన నాయకుడు థియేటర్లలో అడుగుపెట్టనున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates