ముకుల్ దేవ్.. అటు హిందీలో, ఇటు తెలుగులో బాగా పాపులర్ అయిన విలన్. తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన రాహుల్ దేవ్ తమ్ముడే ఈ ముకుల్ దేవ్. అన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ నటుడిగా మంచి గుర్తింపే సంపాదించాడు. తెలుగులో ‘కృష్ణ’తో పాటు అదుర్స్, సిద్ధం, నిప్పు, భాయ్ లాంటి చిత్రాల్లో నటించిన ముకుల్.. తర్వాత కనిపించకుండా పోయాడు. ఇటీవలే అతడి మరణవార్త విని అందరూ షాకయ్యారు. ముకుల్ అనారోగ్యంతో చనిపోయాడన్నారు కానీ.. అతడికి ఏమైందన్నది వెల్లడి కాలేదు.
ఐతే తన తమ్ముడి మరణం గురించి బాలీవుడ్లో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో రాహుల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తల్లిదండ్రుల మరణం, భార్యతో విడాకుల నేపథ్యంలో అతను మానసికంగా దెబ్బ తిన్నాడని.. దీంతో పాటు ఆహార అలవాట్లు మారిపోయాయని.. ఫలితంగానే అతను ప్రాణాలు విడిచాడని అతను స్పష్టతనిచ్చాడు. ముకుల్ మరణం గురించి ఊహాగానాలు కట్టిపెట్టాలని అతను కోరాడు.
‘‘ముకుల్ చనిపోవడం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవేవీ నిజం కాదు. అతను ఫిట్‌గా లేడని అంటున్నారు. కానీ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తే స్థాయి ఫిట్‌నెస్ అతడిది. తల్లిదండ్రుల మరణం తర్వాత అతణ్ని ఒంటరితనం వేధించింది. భార్య నుంచి విడిపోయాడు. అవి అతణ్ని కుంగదీశాయి. ముకుల్‌ను దగ్గరుండి పట్టించుకునేవారు కరువయ్యారు. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండేదుకే ఇష్టపడేవాడు. తనకు సినిమా అవకాశాలు వచ్చినా అతను ఒప్పుకోలేదు. సరిగా తినేవాడు కాదు. ముకుల్ వారం రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు.
అప్పుడు పూర్తిగా తినడం మానేశాడు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడమే తన మరణానికి కారణమని వైద్యులు చెప్పారు. ఈ రోజు ముకుల్ మరణం గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్లలో ఎవ్వరైనా ముకుల్ ఆసుపత్రిలో ఉన్నపుడు వచ్చి పరామర్శించారా’’ అని రాహుల్ దేవ్ ప్రశ్నించాడు. సీరియల్ నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టిన ముకుల్.. సన్ ఆఫ్ సర్దార్, జైహో, యమ్లా పగ్లా దీవానా లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. తర్వాత ‘కృష్ణ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. చనిపోయే సమయానికి ముకుల్ వయసు 54 ఏళ్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates