జాగ్రత్త పడుతున్న టాలీవుడ్ యూత్ హీరోలు

ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే కొత్త సినిమాల షూటింగ్ మొదలు కావడం ఆలస్యం దాని తాలూకు సౌండ్ ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో కనిపించేలా చేయాలి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విద్యలో ఆరితేరిపోయాడు. కొందరు ఇతన్ని ఫాలో కావాలని ట్రై చేసి బొక్క బోర్లా పడుతున్న ఉదంతాలు ఈ మధ్య చాలానే జరిగాయి. హిట్లలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ ఫ్లాపుల పర్వంలో ఏ మాత్రం బిల్డప్ ఇచ్చినా  ట్రోలింగ్ కి దారి తీస్తుంది. ఈ విషయం గుర్తించిన టాలీవుడ్ యూత్ హీరోలు సైలెంట్ గా షూటింగులు చేసుకుంటూ, ఎలాంటి డీవియేషన్లు లేకుండా పూర్తి పని మీద ఫోకస్ పెడుతున్నారు.

వాళ్లలో మొదటగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ గురించి. లైలా దెబ్బకు జ్ఞానోదయం కలిగి అతి ఆత్మవిశ్వాసం కన్న కష్టపడటం మిన్నా అని గుర్తించి ‘ఫంకీ’లో బిజీ అయిపోయాడు. కెవి అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ ఏ సౌండ్ చేయకుండా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొత్తం గుమ్మడికాయ కొట్టాక ప్రమోషన్లు ఎలా చేయాలనే దాని మీద ప్లాన్ చేస్తారట. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం దేశ విదేశాలు తిరుగుతూ ముప్పాతిక శాతం పూర్తి చేశాడు. ఫారిన్ షెడ్యూల్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ ఫిక్సవుతుంది.

సుధీర్ బాబు ‘జటాధరా’ షూట్ ఇటీవలే అయిపోయింది. ప్యాన్ ఇండియా బడ్జెట్ లో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ లో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. పెద్ద బ్యానర్లే భాగస్వామ్యం పంచుకున్నాయి. విఎఫ్ఎక్స్ పనులయ్యాకే పబ్లిసిటీ ఘట్టం మొదలు పెట్టబోతున్నారు. దిల్ రుబా దెబ్బకు షాక్ తిన్న కిరణ్ అబ్బవరం శబ్దం లేకుండా ‘కె ర్యాంప్’ దాదాపు పూర్తి చేసి ఇటీవలే ‘చెన్నై లవ్ స్టోరీ’ స్టార్ట్ చేశాడు. ఆనంద్ దేవరకొండ ఆర్భాటాలకు దూరంగా సితార సంస్థ సినిమాలో తలమునకలై ఉన్నాడు. జాక్ స్ట్రోక్ కి సైలెంటైన సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ హంగామా చేయకుండా అయిపోతోంది. యూత్ హీరోలు ఇలా జాగ్రత్త పడటం మంచి పరిణామమే.