ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి టాలీవుడ్ వరకు రజినీకాంత్ కన్నా ఎక్కువగా నాగార్జున ఇమేజ్ మార్కెట్ చేసేలా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ మధ్య వదిలిన ప్రీ టీజర్ లో రజినీ లుక్స్ కన్నా ఎక్కువ నాగ్ వెనుక నుంచి జుత్తు సరిచేసుకునే షాట్ విపరీతంగా వైరలయ్యింది. అయితే తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం ఇప్పటిదాకా స్పష్టంగా రాకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత అనుమానం లేకపోలేదు. దానికి నాగార్జునే స్వయంగా చెక్ పెట్టేశారు. కూలిలో విలన్ తానేనని, అది ఎలా జరిగింది, ఎందుకు ఒప్పుకున్నాననే విషయం ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి నాగార్జునని కలిసినప్పుడు ఒకటే ప్రశ్న అడిగాడు. మీరు విలన్ గా చేయడానికి ఆసక్తిగా ఉన్నారా, ఒకవేళ లేకపోతే ఒక కప్పు టీ తాగేసి ఇద్దరం సెలవు తీసుకుందామని అన్నాడు. దానికి నాగ్ సమాధానమిస్తూ అలాంటి హద్దులేమి లేవని, ముందు స్క్రిప్ట్ విన్నాక డిసైడ్ అవుతానని చెప్పారు. మొదటి నెరేషన్ లోనే కథ విపరీతంగా నచ్చేసింది. అలా అయిదారుసార్లు ఇద్దరు డిస్కస్ చేసుకున్నాక క్యారెక్టర్ బెస్ట్ గా కుదిరిందని కింగ్ కు నమ్మకం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా రజినీకాంత్, నాగార్జున కలయికకు లోకేష్ కనగరాజ్ శ్రీకారం చుట్టాడన్న మాట.
ఇలా ఫుల్ లెన్త్ విలన్ గా చేయడం నాగార్జునకి ఇది మొదటిసారని చెప్పాలి. కొంత నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ గతంలో కిల్లర్, అంతం లాంటి వాటిలో చేసినప్పటికీ వాటిలో హీరోయిజం ఫ్లేవర్ పుష్కలంగా ఉంటుంది. కానీ కూలిలో అలా కాదు. మెయిన్ హీరో రజినీకాంత్ డామినేషన్ ఎంతలేదన్నా బలంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని నాగార్జున తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా డామినేట్ చేశాడనేది కీలకం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం విక్రమ్ లో రోలెక్స్ ని మించి నాగ్ ఉంటారని, బెస్ట్ కాంబోగా ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూన్ 20 రిలీజ్ కాబోతున్న కుబేర ప్రమోషన్లలో భాగంగా నాగార్జున ఈ సంగతులు పంచుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates