నిన్న నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు 2 వెబ్ సిరీస్ వచ్చేసింది. బోల్డ్ కంటెంట్ వల్ల ఫస్ట్ సీజన్ మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వాటిని తగ్గించేసి ఎక్కువ డ్రామా, యాక్షన్ మీద దృష్టి పెట్టడంతో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ చూసే అవకాశం దక్కింది. అయితే ఇంత పెద్ద బడ్జెట్ తో రూపొందిన క్రేజీ సిరీస్ మీద పెద్దగా సౌండ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీజర్ లాంచ్ ని ఘనంగా నిర్వహించినప్పటికీ అసలైన రిలీజ్ కు ముందు చేయాల్సిన ఈవెంట్లెవీ ప్లాన్ చేయకపోవడంతో ఆడియన్స్ లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. నిన్న మధ్యాహ్నం నుంచే మొత్తం 8 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.
మొత్తం నిడివి సుమారు ఆరు గంటలకు పైగానే ఉంది. చాలా ఓపిగ్గా చూడాలి. అయితే ఆశించిన స్థాయిలో ఇంటెన్సిటీ పండలేదనేది ప్రధానంగా వినిపిస్తున్న కంప్లయింట్. దగ్గుబాటి రానా తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ తో ఈ మాత్రం నిలబెట్టాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇంకా బలహీనంగా ఉండేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్ ఎక్కువసేపు కనిపిస్తాడని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ ఆయన క్యారెక్టర్ ఎక్స్ టెండెడ్ క్యామియోలా అనిపించడం కొంత మైనస్సే. సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడంతో ఎంత భారీతనం ఉన్నా పైపై మెరుగుల్లా అనిపించాయి.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. వెబ్ సిరీస్ లకు మునుపటి క్రేజ్ లేదు. క్రమంగా తగ్గుతున్న వైనం గమనించవచ్చు. ఒకప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, బ్రీత్, మీర్జాపూర్ లాంటివి సోషల్ మీడియాలో చాలా సౌండ్ చేశాయి. కానీ ఇప్పుడలాంటి హడావిడి లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేసిన కంటెంట్ కాబట్టి ఎక్కువ డిస్కషన్ జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి మరీ ప్రచారం చేసుకుంది. అన్నట్టు రానా నాయుడు 3 కూడా ఉందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates