డిప్యూటీ సిఎంగా పాలనలో బిజీగా ఉంటూ అధిక శాతం విజయవాడ, అమరావతిలో ఉంటున్న పవన్ కళ్యాణ్ కు ఇటీవలే కొంత వెసులుబాటు తీరిక దొరుకుతున్నాయి. గత నెల హరిహర వీరమల్లు పూర్తి చేశారు. ఈ మధ్యే ఓజికి గుమ్మడికాయ కొట్టించారు. ఇంకా లేట్ అవుతుందన్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకు వెళ్ళిపోయి అప్పుడే మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సురేందర్ రెడ్డి ఇటీవలే కలిస్తే అప్పట్లో ఆగిపోయిన సినిమా మళ్ళీ స్టార్ట్ కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా సముతిరఖనితో పవన్ మీటింగ్ జరపడం అభిమానుల్లో కొంత టెన్షన్ రేపుతోంది. ఎందుకంటే ఆయన బ్రో దర్శకుడు కాబట్టి.
తమిళ వెర్షన్ వినోదయ సితంని డైరెక్ట్ చేసిన సముతిరఖని తెలుగు రీమేక్ ని అంచనాలకు తగ్గట్టు రూపొందించలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. పైగా ఆయన ఫామ్ లో ఉన్న కమర్షియల్ దర్శకుడు కాదు. విభిన్నమైన కథలను మాత్రమే తెరకెక్కిస్తారు. కానీ పవన్ ఇప్పుడున్న స్టేజిలో ఇలాంటి కాంబోలు వర్కవుట్ కావని ఫ్యాన్స్ ఫీలింగ్. వీరమల్లుని జ్యోతికృష్ణ హ్యాండిల్ చేయడం మీదే వాళ్ళ అనుమానాలు తొలగిపోలేదు. మిస్టర్ బచ్చన్ ఇచ్చిన హరీష్ శంకర్ మీద నమ్మకం ఉండటానికి కారణం గబ్బర్ సింగ్. ఇక సుజిత్ కూడా రాజమౌళి, ప్రశాంత్ నీల్ రేంజ్ దర్శకుడు కాదు కానీ ఓజికి విపరీతమైన హైప్ ఉంది.
పవన్ ఇకపై చేయబోయేది తక్కువ సినిమాలు కాబట్టి క్రేజీ కాంబినేషన్లు పడాలనేది అభిమానుల కోరిక. లోకేష్ కనగరాజ్ లాంటి వాళ్ళను ట్రై చేయమనే అత్యాశ లేదు కానీ సముతిరఖని లాంటి వాళ్ళతో రిస్క్ ఎందుకని అడుగుతున్నారు. అయినా ఇవన్నీ పవన్ వినే స్టేజిలో లేరు కానీ నిజంగా ఫలానా వాళ్ళతో చేయాలని డిసైడ్ అయితే ఎవరూ ఆపలేరు. కాకపోతే సముతిరఖనిది ప్రస్తుతానికి గాసిప్పే. ఈ వారం టాలీవుడ్ పెద్దలందరూ పవన్ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు చర్చకు రావొచ్చని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates