విపరీతమైన జాప్యం వల్ల హరిహర వీరమల్లు మీద ఆశించినంత బజ్ లేనట్టు కనిపిస్తోంది కానీ ట్రైలర్ వచ్చాక ఈ లెక్కలన్నీ మారతాయనే నమ్మకం టీమ్ లో ఉంది. దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పేవి చూస్తుంటే ఇదేదో ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. అతని మాటల ప్రకారం ఈ విజువల్ గ్రాండియర్ లో మొత్తం ఆరు వేల విఎఫ్ఎక్స్ షాట్లున్నాయి. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అన్ని వాడిన సినిమాలు గతంలో ఆది పురుష్ 8 వేల షాట్లతో మొదటి స్థానంలో ఉండగా వీరమల్లు రెండో స్థానం తీసుకోనుంది. ప్రీ విజువలైజేషన్ కోసం మొత్తం యానిమేషన్ లో ముందే చిత్రీకరించి దానికి అనుగుణంగా రియల్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కారణంగానే 10 నెలల్లో షూటింగ్ పూర్తి చేయడం సాధ్యమయ్యింది.
ఒక్కో విఎఫ్ఎక్స్ షాట్ లో పది లేయర్లు ఉంటాయి. హీరో పవన్ కళ్యాణ్ ముందు ఉన్నప్పటికీ వెనుకాల నేపథ్యంలో వందల వేల నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. దీని వల్ల ఒక్క షాట్ ని రెండర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఏ మాత్రం తేడా జరిగినా అవుట్ ఫుట్ చెడిపోతుంది. కేవలం ఈ విజువల్ ఎఫెక్ట్సే హరిహర వీరమల్లులో రెండు గంటల పాటు ఉంటాయంటేనే ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం బడ్జెట్ సుమారు 340 కోట్ల దాకా అయితే పది నిముషాలు సాగే ఒక్క క్లైమాక్స్ కోసమే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రాజీపడకూడదనే ఇంత వ్యయం చేశారు.
వివిధ విదేశీ నిపుణులు పని చేసిన హరిహర వీరమల్లు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమని జ్యోతి కృష్ణ చెబుతున్నారు. విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇన్ సైడ్ టాక్. జూలై 18 లేదా 25 ఆప్షన్లు చూస్తున్నట్టు సమాచారం. ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ చేసిన సినిమా కావడంతో అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. హైప్ సంగతి ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించారు. పార్ట్ 2కి సంబంధించిన లీక్ మొదటి భాగం చివర్లో ఇవ్వనున్నారు.