ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడమే గగనమైపోయింది. రెండు మూడేళ్ళకో రిలీజ్ చేస్తున్న వాళ్ళూ లేకపోలేదు. ప్రభాస్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని సెట్స్ మీద ఉంచుతున్నా లాభం లేకపోతోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు ఇవ్వడం వెనుక ఒక ప్రత్యేక విశేషం ఉంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కెరీర్ మొదలుపెట్టిన పవన్ ఇప్పటిదాకా ఏ ఇయర్ లోనూ రెండు రిలీజులు చేసుకోలేదు. ఒక్క 2006 లో మాత్రమే బంగారం, అన్నవరం ఏడు నెలల గ్యాప్ లో వచ్చాయి. ఆశించిన ఫలితాలు అందుకోకపోవడం వేరే విషయం.
ఇప్పుడలాంటి సీనే ఇరవై సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతోంది. దానికి 2025 వేదిక కానుంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి రెండు విడుదలకు రెడీ అవుతున్నాయి ఏదైనా కారణాల వల్ల డేట్లు కొంచెం ముందు వెనక్కు జరగొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కానే. 1996 నుంచి 2025 దాకా పవన్ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం గమనించాల్సిన విషయం. ఇది కాకతాళీయంగా జరిగినప్పటికి ఫ్యాన్స్ కి మాత్రం స్పెషల్ మెమరీ కానుంది. భవిష్యత్తులో పవన్ ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఇది రిపీట్ కాకపోయే అవకాశాలు ఎక్కువ.
మార్కెట్ పరంగా ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. హరిహర వీరమల్లు, ఓజి కలిపి ఎంతలేదన్నా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల దాకా థియేటర్ బిజినెస్ చేయబోతున్నాయి. ఇది ఒకరకంగా కొత్త మైలురాయి. సెప్టెంబర్ 25 ఓజి రావడం కన్ఫర్మ్ అయ్యింది కానీ ఎటొచ్చి వీరమల్లు తేదీ ఇంకా డిసైడ్ కాలేదు. జూలై మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ట్రైలర్ కట్ ఫినిష్ చేసి దాంతో పాటే విడుదల తేదీని లాక్ చేయబోతున్నారు. ఇది చూశాకే అంచనాలు అమాంతం పెరుగుతాయనే ధీమా టీమ్ లో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates