ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న కుబేరకు తక్కువ సమయమే ఉన్నా ప్రమోషన్లు ఆగకుండా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులు స్వయంగా రంగంలోకి దిగి ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తున్నాం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫైనల్ స్టేజి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉండగా, అఖిల్ పెళ్లి సందర్భంగా నాగార్జున చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడా వేడుక అయిపోయింది కాబట్టి ఇంకో రెండు రోజుల్లో మీడియా, ఫ్యాన్స్ కి అందుబాటులో రాబోతున్నాడు. ఇక ధనుష్ ఎప్పుడు రమ్మన్నా హైదరాబాద్ వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. జూన్ 13 నుంచి తనతో వరసగా ఇంటరాక్షన్లు చేస్తున్నారు.
కుబేర సెన్సార్ ఇటీవలే పూర్తయ్యింది. 3 గంటల 15 నిమిషాలకు యు/ఏ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇంత నిడివి అంటే వర్కౌట్ అవుతుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతం దాన్ని కుదించే పనిలో ఉన్నారు. సెన్సార్ అయిన కాపీలో మన అవసరానికి తగ్గట్టు కత్తిరింపులు చేసుకోవచ్చు కానీ ఎలాంటి జోడింపులు చేయలేం. అలా చేస్తే కనక మళ్ళీ అప్లై చేసుకోవాలి. అందుకే ముందు జాగ్రత్తగా లెన్తీ వెర్షన్ ని సెన్సార్ చేయించి ఇప్పుడు ఎడిటింగ్ పని చూస్తున్నారు. 2 గంటల 50 నిమిషాలకు లాక్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఒకవేళ సాధ్యం కాకపోతే 3 గంటలకు మించి ఉండకుండా జాగ్రత్తగా చూస్తున్నారట.
మాములుగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఎక్కువ నిడివితో ఉంటాయి. ఆనంద్ ఫస్ట్ ఆయన లాక్ చేసిన నిడివి మూడు గంటల పైమాటే. కానీ కొత్త హీరో హీరోయిన్ ని అంతసేపు అది కూడా సాఫ్ట్ సబ్జెక్టుతో ఆడియన్స్ చూడలేరని భావించి దాంట్లో ఇరవై నిముషాలు తగ్గించి థియేటర్ రిలీజ్ చేశారు. తర్వాత డివిడిలో మొత్తం వచ్చింది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న కుబేరలో సాలిడ్ కంటెంట్ ఉంటే లెన్త్ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పుష్ప 2, యానిమల్ అంతకన్నా ఎక్కువ ఉన్నా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. మరి కుబేర ఆ స్థాయిలో ఉంటే టెన్షన్ అక్కర్లేదు కాని కుబేర లాంటి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ క్రిస్పీగా ఉంటేనే మంచిది.