రిలీజ్ డేట్ల పంచాయితీ పూటకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. జూన్ 12 ని హరిహర వీరమల్లు వదిలేసుకున్నాక కొత్త తేదీ ఏదనే దాని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. జూన్ 26 ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆప్షన్. అయితే మరుసటి రోజు జూన్ 27 కన్నప్ప వస్తోంది. మంచు విష్ణు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే మూడ్ లో లేడని మాటలను బట్టి అర్థమవుతోంది. ఇండస్ట్రీ జనాలు కొందరు ఇదే విషయంగా తనను ఆఫ్ ది రికార్డ్ అడిగితే ముందు అనౌన్స్ చేసింది నేను కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా తప్పుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడట.
ఒకవేళ ఇది నిజంగా జరిగితే ఎవరికి ఇబ్బంది అనే ప్రశ్న తలెత్తుతుంది. కన్నప్పలో మంచు విష్ణునే హీరో అయినప్పటికీ ప్రభాస్ క్యామియో మీద భారీ అంచనాలున్నాయి. అరగంట ఉంటాడని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఆ పాత్ర కనక తెరమీద పండితే ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కుతుంది. అదొక్కటే కాదు ఇతర క్యారెక్టర్లు, శివుడి ఎలిమెంట్, క్లైమాక్స్, పాటలు, కన్నప్ప గొప్పదనం చూపించే ఎపిసోడ్లు ఇలా దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని అంటున్నారు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ స్టార్ హీరోలు ఎవరున్నారు, ఎవరు లేరనే లెక్కలు వేసుకోని మాట వాస్తవమే.
ఇక ఇటువైపు చూస్తే హరిహర వీరమల్లు మీద బజ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నా ట్రైలర్ వచ్చాక లెక్కలు మారిపోతాయి. పెద్దగా ఆసక్తి లేదన్నట్టు కనిపిస్తున్న పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లోనే రికార్డులు మొదలవుతాయి. నిర్మాత ఏఎం రత్నం హామీ ఇస్తున్నట్టు సినిమా కనక అదిరిపోతే పవన్ సునామిని తట్టుకోవడం కష్టం. ఇదే జరిగితే ఎంత ప్రభాస్ ఉన్నా సరే కన్నప్పకు కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. రెండింటికి ఫైనల్ గా టాకే కీలకం. వీరమల్లుకి జూలై 18 ఆప్షన్ కూడా ఉందట. చివరికి ఏది ఫైనల్ చేస్తారో ఎవరితో క్లాష్ కు సై అంటారో ఓ రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.