=

పవన్‌లో అనూహ్య మార్పు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా రెగ్యులర్‌గా సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తన కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న  మూడు సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నారు పవన్. ముందుగా గత నెలలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అవగొట్టేశారు. తర్వాత ‘ఓజీ’ సెట్లో అడుగు పెట్టి ఇటీవలే దాని పని కూడా ముగించారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆయన తయారవుతున్నారు. 

ఇంకో మూడు రోజుల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ కూడా మొదలవుతుందని అంటున్నారు. ఆ సినిమాలో పవన్ చేస్తున్నది పోలీస్ క్యారెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు తగ్గట్లు ట్రాన్స్‌ఫామ్ అవ్వాలని అనుకున్నాడో ఏమో కానీ.. పవన్ లుక్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. తాజాగా తన పర్సనల్ స్టైలిస్ట్‌కు చెందిన సెలూన్ ఓపెనింగ్ కోసం నిన్న టీషర్ట్, షార్ట్ వేసుకుని వచ్చిన పవన్ సరికొత్త లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాగా పరువు తగ్గి ఫిట్‌గా కనిపిస్తున్నాడు పవన్.

కొన్ని నెలల కిందట కుంభమేళాకు వెళ్లి పుణ్య స్నానం చేసిన సందర్భంగా పవన్ లుక్ గురించి చాలామంది నెగెటివ్ కామెంట్లు చేశారు. ఒకప్పుడు ఫిట్‌నెస్‌కు మారు పేరుగా ఉన్న పవన్‌కు పొట్ట పెరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పవన్ కొన్ని రోజులు అనారోగ్య సమస్యలతోనూ ఇబ్బంది పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు నుంచి రాజకీయాల్లో తీరిక లేకుండా గడపడం.. ఎన్నికల తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు నెత్తికెత్తుకోవడంతో పవన్ ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టలేని పరిస్థితి.

మళ్లీ సినిమాల్లో నటించాల్సి రావడంతో పవన్ లుక్ మార్చుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేసినట్లున్నాడు. దాని ప్రభావం లేటెస్ట్ లుక్‌లో స్పష్టంగా కనిపించింది. పవన్‌లో మునుపటి ఛార్మ్ కనిపిస్తోందిప్పుడు. ఆయన ఇదే లుక్‌ను మెయింటైన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొన్ని నెలల వ్యవధిలో ఇంత మార్పు చూసి.. పవన్ ఏం చేశాడో చెబితే తామూ అదే ఫాలో అవుతామని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.