ఎన్నో ఆశలు పెట్టుకుని కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు లేదా రిలీజ్ కోసం అష్టకష్టాలు పడుతున్నప్పుడు కొందరు హీరోలు అది తమకు సంబంధం లేని వ్యవహారంలా దూరం ఉంటారు. నటించాం, డబ్బులు తీసుకున్నాం అక్కడితో అయిపోయిందనే ధోరణి ఎక్కువ శాతం కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్, సిద్దు జొన్నలగడ్డ దీనికి భిన్నంగా వ్యవహరించడం మంచి సంకేతాలు ఇస్తోంది. హరిహర వీరమల్లు కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ పదకొండు కోట్లను నిర్మాత ఏఎం రత్నంకు వెనక్కు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా వచ్చిన వార్త వీరమల్లుకి పెద్ద రిలీఫ్ కానుంది.
సిద్ధూ జొన్నలగడ్డ జాక్ వల్ల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తీవ్రంగా నష్టపోయారు. బ్రేక్ ఈవెన్ లో సగం కూడా వసూలు కాకపోవడం డిజాస్టర్ స్థాయిని పెంచింది. ఇందుకు గాను సిద్ధూ తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో సగానికి పైగా వెనక్కు ఇచ్చినట్టు మరో అప్డేట్. ఇది నాలుగున్నర కోట్ల దాకా ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. ఈ రెండు పరిణామాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు, ఫోటోలు రాలేదు కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళో రేపో ఈ లాంఛనం జరగనుందని తెలిసింది. జాక్ ఫలితం మరీ ఇంత తీవ్రంగా వస్తుందని ఊహించని సిద్ధూ ప్రొడ్యూసర్ కు ఉపశమనం కలిగించడం ఆహ్వానించాల్సిందే.
ఇలా జరగడం మొదటిసారి కాదు. జానీ టైంలో పవన్ కళ్యాణ్, బాబా అప్పుడు రజనీకాంత్ ఇదే తరహాలో రెమ్యునరేషన్లలో కొంత వెనక్కు ఇవ్వడం అప్పటి మీడియాలో హైలైట్ గా నిలిచింది. నిర్మాతలకు ఇలాంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించినప్పుడు మరిన్ని సినిమాలు తీసేందుకు ధైర్యం వస్తుంది. నిండా మునిగిపోయాక సహాయం అందక ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతలు ఎందరో ఉన్నారు. ప్రొడక్షన్ మానేసి ఇతర వ్యాపారాలు చూసుకుంటున్న వాళ్ళ లిస్టు పెద్దదే. ఇలా పవన్, సిద్దు లాగా తమ శక్తి మేరకు హీరోలు కనక సహాయ దృక్పథం చూపిస్తే టాలీవుడ్ అభివృద్ధికి తమ వంతు చేయూత ఇచ్చినట్టే.