కొందరు అభిమానులు రీ రిలీజ్ పేరిట చేస్తున్న చేష్టలు క్రమంగా హద్దు మీరిపోయి వెగటు పుట్టించేలా మారుతున్నాయి. ఇవాళ విడుదలైన ఖలేజా షోల సందర్భంగా ఒక అభిమాని పాముని తీసుకొచ్చి సీన్ రీ క్రియేట్ చేయడం టూ మచ్ అనిపించేసింది. అది బొమ్మదే కావొచ్చు. కానీ పాము, బల్లి లాంటి కీటకాలకు సున్నితత్వంతో తీవ్రంగా భయపడే వాళ్ళు చాలా ఉంటారు. పొరపాటున అది కనక వాళ్ళ మీద పడితే వయసు మళ్ళిన వాళ్లకు గుండెపోటే రావొచ్చు. ఇప్పుడేం జరగలేదు కాబట్టి సమర్ధించడం కాదు కావాల్సింది. అసలలాంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడాల్సింది ముమ్మాటికి ఫ్యాన్సే.
ఇదే కాదు ఆధ్యాత్మికత తొణికిసలాడే సదాశివ సన్యాసి పాటకు మాడరన్ డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలు డాన్స్ చేయడం రీల్స్ రూపంలో ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. డ్యూయెట్ అయితే ఏదో అనుకోవచ్చు. కానీ డివోషనల్ సాంగ్ కి ఇలా చేయడం ముమ్మాటికీ ఖండనీయం. గతంలో మురారి రీ రిలీజ్ థియేటర్లలో ప్రేమ జంటలు, భార్యా భర్తలు అలనాటి రామచంద్రుడి పాటకు తాళి కట్టుకోవడం, తలంబ్రాలు వేసుకోవడం పట్ల ఆగమ పండితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికే కాదు జగదేకవీరుడు అతిలోకసుందరి, గబ్బర్ సింగ్, పోకిరి తదితర సినిమాలప్పుడు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.
వీటిని కట్టడి చేయడం జరిగే పని కాదు. కానీ సోషల్ మీడియా పాపులారిటీ కోసమో లేదా రీల్స్ ద్వారా వచ్చే వ్యూస్ కోసమో విచిత్ర వేషధారణలు, పనులు చేయడం సరికాదు. వీటిని ఇప్పటి స్కూల్ పిల్లలు, కాలేజీ యువత అందిపుచ్చుకుంటే ఇదో అలవాటుగా మారిపోతుంది. భవిష్యత్తులో యానిమల్ రీ రిలీజ్ చేస్తే రన్బీర్ కపూర్ న్యూడ్ గా నడిచే సీన్ ని ఎవరికైనా రీ క్రియేట్ చేయాలనే ఆలోచన వస్తే ఎంత ప్రమాదమో ఊహించుకోండి. ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది. అంతే తప్ప సినిమాల్లోని సీన్లను ఎపిసోడ్లను ఇలా లైవ్ లో చేసి చూపించడం ద్వారా కలిగే ఆనందం కన్నా ఆందోళనే ఎక్కువ.