ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో థియేటర్ల వ్యవస్థ మీద ఫోకస్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరుకున్న రేట్లు ఇచ్చి పూర్తి ప్రోత్సాహం అందిస్తుండగా.. తన సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో థియేటర్ల సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన ఇకపై రేట్ల కోసం వ్యక్తిగతంగా వచ్చి ప్రభుత్వాన్ని ఎవ్వరూ కలవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఛాంబర్ ద్వారా, ఒక పద్ధతి ప్రకారమే ఇవి జరుగుతాయన్నారు. మరోవైపు థియేటర్లలో సౌకర్యాలు, క్యాంటీన్లలో ధరలతో పాటు భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని మీద వైసీపీ మద్దతుదారులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో జగన్ ఇలాంటి చర్యలు చేపడితే తిట్టిన వాళ్లు.. ఇప్పుడు పవన్‌ను ఎలా సమర్థిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఐతే ఈ విషయంలో పవన్‌కు, జగన్‌కు పోలిక పెట్టడమే అసమంజసం. జగన్ థియేటర్ల మీద ఉక్కు పాదం ఎందుకు మోపారు? ఎలాంటి చర్యలు చేపట్టారు అన్నది తెలియంది కాదు. సరిగ్గా పవన్ సినిమా రిలీజ్ కాబోతుండగా.. అదే రోజు థియేటర్ల మీద అధికారులు దాడులకు వెళ్లారు. అప్పటికప్పుడు థియేటర్లను మూయించారు. షోలు రద్దు చేయించారు. ఎన్నో ఏళ్ల ముందు జీవోను బయటికి తీసి 5, 10 రూపాయలకు టికెట్లు అమ్మించారు. ఇవన్నీ కక్షపూరితంగా చేపట్టిన చర్యలన్నది స్పష్టం. ముందు పవన్ సినిమాను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. తర్వాత మొత్తంగా ఇండస్ట్రీనే తమ కాళ్ల ముందుకు వచ్చేలా చేసుకున్నారు.
కానీ ఇప్పుడు పవన్ చేస్తున్నది కక్ష సాధింపు అని ఎవ్వరైనా అనగలరా? ఆయన అన్నీ నిబంధనల ప్రకారం జరగాలంటున్నారు. ఏ సినిమాకు ఆ సినిమా నిర్మాతలు వచ్చి వ్యక్తిగతంగా టికెట్ల రేట్ల కోసం అడగడం వద్దంటున్నారు. ఛాంబర్ ద్వారా ఇధంతా జరగాలంటున్నారు. ఇక కోరుకున్న రేట్లు పొందారు. పెద్ద సినిమాలకు అదనపు రేట్లూ వస్తున్నాయి. అలాంటపుడు థియేటర్లలో అన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా.. ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలూ అందుతున్నాయా.. భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా పరిశీలించమని అధికారులను ఆదేశించారు. వాళ్లు ఆ పనిలోనే ఉన్నారు. ఇందులో కక్ష సాధింపు ఏముంది? జగన్ చేసింది, పవన్ చేసింది ఒక్కటే ఎలా అవుతుంది?
Gulte Telugu Telugu Political and Movie News Updates