తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రకటించాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది పురస్కారాలను పునరుద్దరించే దిశగా చర్యలు చేపట్టబోతున్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ అవార్డులుగా నందికి చాలా పెద్ద గుర్తింపు ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని టాలీవుడ్ ఆస్కార్ గా భావించేవాళ్లు. నటీనటులు, సాంకేతిక నిపుణులు గర్వంగా ఫీలయ్యేవాళ్ళు. క్రమంగా విజేతల ఎంపికలో చోటు చేసుకున్న వివక్ష, సామాజిక సమీకరణాలు, వివాదాలు క్రమంగా ఆ వైభవాన్ని తగ్గించేశాయి. పద్నాలుగేళ్ల క్రితం వీటిని ఇవ్వడం పూర్తిగా ఆపేశారు.
గద్దర్ అవార్డులు జూన్ 14 ప్రధానం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నందికి కదలిక రావడం సంతోషించాల్సిన విషయమే. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది. ఇప్పుడు దర్శక నిర్మాతలు మళ్ళీ వీటి కోసం ఫ్రెష్ గా అప్లై చేసుకోవాలి. విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఖచ్చితంగా పోలికలు వస్తాయి. ఉదాహరణకు గద్దర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అయితే నంది బెస్ట్ యాక్టర్ ఎవరనే దాని గురించి డిబేట్లు జరుగుతాయి. అదే హీరోకి ఇస్తే ఒక చిక్కు. ఇవ్వకపోతే ఇంకో తలనెప్పి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కంపారిజన్లతో యాంటీ ఫ్యాన్స్ విసిగిస్తారు. దీన్ని కాచుకోవడం ప్రభుత్వానికి ఏమో కానీ నటీనటులకు ఇబ్బందే.
సరే ఇవన్నీ మాములే కానీ వీలైనంత త్వరగా నంది అవార్డులకు సంబంధించిన కార్యాచరణ రూపొందించడం అవసరం. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోబోతున్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు ఎలాగూ తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డులు ఇస్తున్నప్పుడు మళ్ళీ అవే సినిమాలకు, ఆర్టిస్టులకు మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఇవ్వడం అవసరమానే కామెంట్లు కూడా వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో చూడాలి. అన్నీ కుదిరితే దసరా పండక్కు నంది వేడుక జరపాలనే ప్లాన్ ఉందట.