చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడి అవతారం ఎత్తారు. ఆయన డైరెక్షన్ లో రూపొందిన సీత పయనం విడుదలకు రెడీ అవుతోంది. కూతురు ఐశ్వర్యతో పాటు ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇది నిజానికి విశ్వక్ సేన్ తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు. తర్వాత ఏవో విభేదాలు వచ్చి ఇద్దరూ మీడియాకెక్కి కొంత వివాదం రేగడం ప్రేక్షకులకు గుర్తే. అర్జున్ ఈ వ్యవహారంలో చాలా హర్ట్ అయ్యాడు. అలాని ప్రయత్నం ఆపలేదు. నిరంజన్ ని తీసుకొచ్చి పూర్తి చేశాడు. ఇవాళ హైదరాబాద్ లో సుకుమార్ ముఖ్య అతిథిగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ సందర్భంగానే మెగా ముచ్చట వచ్చింది.
షూటింగ్ స్టార్ట్ కాక ముందు అర్జున్ ఈ స్టోరీని ముందు మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు. ఎవరికి సూటవుతుందో అడగాలనే ఉద్దేశంతో. అయితే ఫుల్ నెరేషన్ వింటానని చిరు చెప్పడంతో రెండు గంటల పాటు పాటు మొత్తం చెప్పారు అర్జున్. తర్వాత అదనంగా మరో రెండు గంటలు మార్పులు చేర్పులు, ముఖ్యమైన అంశాల గురించి డిస్కషన్ జరిగింది. అలా మెగా ఇన్ పుట్స్ సీత పయనంకి చాలా ఉపయోగపడ్డాయి. ఇదంతా స్టేజి మీద అర్జునే చెప్పుకొచ్చారు. వీళ్లకు ఈ బాండింగ్ ఇప్పటిది కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. శ్రీ మంజునాథలో తొలిసారి దేవుడు భక్తుడుగా కలిసి పోటీపడి నటించారు.
సో చిరంజీవి మెచ్చుకున్నారంటే సీత పయనంలో ఏదో బలమైన మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తోంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ధృవ సర్జ, అర్జున్ లు క్యామియోలు కూడా చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ లవ్ ఆండ్ యాక్షన్ డ్రామాని పూర్తిగా తెలుగులోనే తీయడం గమనార్హం. టాలీవుడ్ లో అడుగు పెడుతున్న నిరంజన్, ఐశ్యర్యలకు ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. జై హింద్ లాటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన అర్జున్ ఈసారి ప్రేమకథను ఎంచుకున్నారు. కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించారు లెండి. మరి ఈసారి ఎలాంటి విజయం సాధిస్తారో.