నాందితో సీరియస్ టర్నింగ్ తీసుకుని విజయం అందుకున్న అల్లరి నరేష్ కి ఆ తర్వాత అదే తరహాలో చేసిన ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తీవ్రంగా నిరాశపరిస్తే నా సామిరంగా సక్సెస్ నాగార్జున ఖాతాలోకి వెళ్ళిపోయింది,. తిరిగి కామెడీ ట్రాక్ లో చేసిన ఆ ఒక్కటి అడక్కుతోనూ పనవ్వలేదు. రంగస్థలం రేంజ్ లో ఉంటుందని ఊరించిన బచ్చల మల్లిలో డ్రామా ఎక్కువైపోయి జనం తిరస్కరించారు. దీంతో తనెక్కడ ట్రాక్ తప్పుతున్నాడో గుర్తించిన అల్లరోడు క్రేజీ అండ్ ట్రెండీ కంటెంట్ వైపు దృష్టి సారిస్తున్నాడు. వాటిలో ఒక దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గత ఏడాది అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా ప్రారంభమయ్యింది. మెహర్ తేజ్ దర్శకుడు. దీనికి ఆల్కహాల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ట్విస్ట్ ఏంటంటే ఇందులో హీరోకు మందు తాగే అలవాటు ఉండదట. అలాంటప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టారంటే అదే సస్పెన్స్ ఎలిమెంట్ అంటోంది టీమ్. మెహర్ తేజ్ గతంలో ఫ్యామిలీ డ్రామా తీశాడు. సుహాస్ నెగటివ్ షేడ్ లో నటించిన ఈ క్రైమ్ థ్రిలర్ ఓటిటిలో మంచి స్పందన తెచ్చుకుంది. అది చూసే అల్లరోడు ఆల్కహాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. పేరైతే క్రేజీగానే ఉంది మరి.
షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందని సమాచారం. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అల్లరోడి మార్కు హాస్యంతో పాటు కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఆల్కహాల్ లో ఉంటాయట. ఇప్పటిదాకా టచ్ చేయని జానర్ లో అల్లరి నరేష్ ని చూడొచ్చని వినికిడి. ఏదైతేనేం తనను తిరిగి ఫామ్ లోకి రావడం చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సోలో హీరోగా తను సాలిడ్ హిట్టు కొట్టి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు ఓపెనింగ్స్ ఇస్తున్నారు. కానీ సరైన కంటెంట్ పడితే మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడు. ఆల్కహాల్ ఏమైనా తీరుస్తుందేమో చూడాలి.