తెలుగు రాష్ట్రాల్లో తమ డిమాండ్ల సాధన కోసం థియేటర్లను మూసి వేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం మీద పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినా సరే.. దీని చుట్టూ నెలకొన్న వివాదం మాత్రం సద్దుమణగట్లేదు. ఓవైపు జూన్ రెండో వారంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉండగా.. థియేటర్లకు సమ్మెకు పిలుపునివ్వడం వెనుక కుట్ర దాగి ఉందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం సీరియస్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టారు.
నిన్నటి ప్రెస్ మీట్లో దిల్ రాజు చేసిన ఒక కామెంట్ చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ నేతల్లో ఒకరైన రాజమండ్రి ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణనే థియేటర్ల బంద్ వెనుక ఉన్నట్లు రాజు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తీవ్రంగానే తీసుకుంది. సత్యనారాయణ జనసేన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వాములైనట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో నిరూపించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది.
దిల్ రాజు.. సత్యనారాయణ గురించి కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో సైతం పవన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. థియేటర్ల సమ్మె నిర్ణయం వెనుక జనసేన వాళ్లు ఉన్నా కూడా వదిలి పెట్టొద్దని ఆయన తేల్చి చెప్పారు. ఈ ప్రెస్ నోట్ బయటికి వచ్చిన కాసేపటికే.. సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. మొత్తానికి థియేటర్ల సమ్మె వ్యవహారం టాలీవుడ్లో ప్రకంపనలు రేపేలాగే కనిపిస్తోంది. దీని వెనుక ఉన్న వారందరికీ తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
Gulte Telugu Telugu Political and Movie News Updates