త్వ‌ర‌ప‌డ‌దాం… క‌ర్చీఫ్ వేసేద్దాం

టాలీవుడ్లో మ‌ళ్లీ రిలీజ్ డేట్ల జాత‌ర మొద‌లైంది. ఎప్పుడో రాబోయే క్రేజీ సీజ‌న్ల‌కు చాలా ముందుగానే డేట్లు ప్ర‌క‌టించ‌డంపై నిర్మాత‌లు దృష్టిసారించారు. గ‌త కొన్ని రోజుల్లో ప‌లు చిత్రాల రిలీజ్ డేట్లు ఖ‌రార‌య్యాయి. 2026 సంక్రాంతికి ఇంకా ఏడున్న‌ర నెలల స‌మ‌యం ఉండ‌గా.. ఇప్పుడే డేట్ ఇచ్చేసింది ఒక చిత్ర బృందం. న‌వీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న అన‌గ‌న‌గా ఒక రాజు చిత్రాన్ని స‌రిగ్గా సంక్రాంతి రోజైన జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఈ రోజే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. 

సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి -అనిల్ రావిపూడి సినిమా షెడ్యూల్ అయింద‌ని తెలిసినా.. న‌వీన్ సినిమాను షెడ్యూల్ చేశారు. చిరు సినిమా సంక్రాంతికి ప‌క్కా కానీ.. ఇంకా డేట్ అయితే ఖ‌రారు చేయ‌లేదు. స‌రిగ్గా సంక్రాంతి డేట్‌ను అన‌గ‌న‌గా ఒక రోజు తీసుకోవ‌డంతో చిరు సినిమా కొంచెం ముందే వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. సంక్రాంతిని టార్గెట్ చేసిన వేరే చిత్రాల మేక‌ర్స్ కూడా క‌ర్చీఫ్ వేయ‌డానికి చూస్తార‌న‌డంలో సందేహం లేదు. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా కూడా ఉండొచ్చు. 

ఇక సంక్రాంతికి ముందు క్రేజీ సీజ‌న్ అయిన క్రిస్మ‌స్‌కు టాలీవుడ్ నుంచి ముందుగా బెర్తు బుక్ చేసుకున్న సినిమా.. డెకాయిట్. అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా రూపొందుతున్న ఈ థ్రిల్ల‌ర్ మూవీ నుంచి ఈ రోజే టీజ‌ర్ లాంచ్ చేశారు. దాంతో పాటుగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. క్రిస్మ‌స్‌కు ఇంకా ఒక‌ట్రెండు సినిమాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అందులో నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అఖండ‌-2 కూడా ఉండే అవ‌కాశ‌ముంది. ముందు ద‌స‌రాకే ఈ చిత్రాన్ని అనుకున్నారు కానీ.. షూటింగ్ ఆల‌స్యం వ‌ల్ల క్రిస్మ‌స్ సీజ‌న్ మీద క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. 

క్రిస్మ‌స్‌కు వేరే భాష‌ల నుంచి కూడా పెద్ద సినిమాలు వ‌చ్చే అవ‌కాశ‌ముండ‌డంతో ఈ పాన్ ఇండియా మూవీకి త్వ‌ర‌గా డేట్ ప్ర‌క‌టించేయాల‌ని చూస్తున్నారు. బాల‌య్య పుట్టిన రోజైన జూన్ 9న రిలీజ్ డేట్‌తో టీజ‌ర్ వ‌దిలే అవ‌కాశ‌ముంది. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఓజీని ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌రు 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రాకు అనుకున్న మ‌రో చిత్రం సంబ‌రాల ఏటిగ‌ట్టును అక్క‌డ్నుంచి వాయిదా వేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే దీనికీ కొత్త డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు.