బాలీవుడ్లో కొన్నేళ్లుగా నడుస్తున్న ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌ను ఈ మధ్య తెలుగు వాళ్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. సినిమాలో ఏదైనా అభ్యంతరకర డైలాగ్ ఉన్నా.. లేదంటే చిత్ర బృందంలోని వారు హద్దులు దాటి మాట్లాడినా, సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా.. ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. కొన్ని నెలల కిందట వైసీపీని ఉద్దేశించి కమెడియన్ పృథ్వీ ఏదో అన్నాడని.. ‘లైలా’ సినిమాను ఆ పార్టీ వాళ్లు టార్గెట్ చేశారు. ఆ సినిమా కంటెంట్ లేక డిజాస్టర్ అయినా.. తామే దాన్ని ఫెయిల్ చేసినట్లు చెప్పుకున్నారు. ఇక తాజాగా ‘భైరవం’ సినిమా రెండు వర్గాలకు టార్గెట్ అయింది.
ముందేమో దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన ఒక పొలిటికల్ కామెంట్‌పై వైసీపీ వాళ్లు ఫైర్ అయ్యారు. ఇంతలో ఆశ్చర్యకరంగా మెగా ఫ్యాన్స్ లైన్లోకి వచ్చారు. దర్శకుడి పాత ఫేస్ బుక్ పోస్టు మీద వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బాయ్‌కాట్ భైరవం’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. వీళ్లు అందుకోగానే.. వైసీపీ వాళ్లు సైలెంట్ అయ్యారు.
ఐతే నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం గట్టిగానే జరిగింది. విజయ్.. చిరు డైలాగ్ చెప్పి తన మెగా అభిమానాన్ని చాటుకున్నాడు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అతను.. నిన్నటి ఈవెంట్లో ఆ వివాదం గురించి ఏమీ మాట్లాడలేదు.
తర్వాత మంచు మనోజ్.. విజయ్ గురించి చాలా బాగా మాట్లాడ్డమే కాక.. తన ప్రమేయం ఏమీ లేని వివాదానికి తాను సారీ చెప్పాడు. ఆల్రెడీ కుటుంబ వివాదానికి సంబంధించి మనోజ్ మీద జనాల్లో సానుభూతి ఉంది. ఇక ఈ సినిమాను కాపాడ్డం కోసం తన తాపత్రయమంతా నిన్న కనిపించింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కూల్ అయినట్లే కనిపిస్తున్నారు. ‘బాయ్‌కాట్ భైరవం’ ట్రెండ్ ఆగింది. మనోజ్ స్పీచ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. నువ్వెందుకు సారీ చెప్పడం అని కామెంట్ చేస్తూ.. ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ‘భైరవం’ చుట్టూ నెలకొన్న కాంట్రవర్శీలకు ఇంతటితో తెరపడినట్లే కనిపిస్తోంది. ఈ శుక్రవారం ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.