=

AI సినిమా : ప్రమోదమా….ప్రమాదమా

ఇటీవలే కర్ణాటకకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కొందరు ఏఐ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీ వాడి లవ్ యు అనే సినిమా తీశారు. ఒక గదిలో కూర్చుని రెండు మూడు కంప్యూటర్లు, లాప్ టాపులు ముందేసుకుని దీన్ని పూర్తి చేశారు. అక్షరాలా ఈ ప్రాజెక్టుకైన ఖర్చు కేవలం 10 లక్షల రూపాయలు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి అయ్యే వ్యయం కన్నా ఇది చాలా తక్కువ. సెన్సార్ యు/ఏ ఇస్తే ఒక థియేటర్లో రిలీజ్ చేశారు. ఆ రకంగా ఇండియాలోనే మొదటి ఏఐ మూవీగా రికార్డు సాధించారు. పూజారి, నరసింహమూర్తి, నూతన్ అనే ముగ్గురు కుర్రాళ్ళు కలిసి ఈ అద్భుతం చేసి చూపించారు.

చైనాలో ఇదే తరహాలో పైరేట్ క్వీన్ అనే భారీ చిత్రం తీస్తే అందులో నిజంగా నటీనటులు ఉన్నారేమో అన్నంత గొప్పగా వచ్చింది అవుట్ ఫుట్. ఇవే కాదు అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఏఐ మూవీస్ తీస్తున్న లిస్టు అంతకంతా పెరుగుతూ పోతోంది. ఇది ప్రమోదమా ప్రమాదమా అంటే రెండు కోణాల్లోనూ కనిపిస్తుంది. స్టార్ల రెమ్యునరేషన్లు, షూటింగ్ భారాలు, మార్కెటింగ్ కష్టాలు, ప్రమోషన్ల వ్యయం, ఓటిటి తలనెప్పులు ఇవన్నీ నిర్మాతలకు గుదిబండగా మారుతున్న నేపథ్యంలో సినిమా తీయడం పెద్ద సవాల్ గా మారిపోయింది. కోట్ల రూపాయల బ్యాకప్ ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడీ ఏఐ ట్రెండ్ క్రమంగా ఇతర భాషలకూ పాకుతుంది. క్రమంగా ఆర్టిస్టులు నటించడం మానేసి ఏఐలో చూపించేయండని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి రాయల్టీ రూపం రెమ్యునరేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఒళ్ళు కదలకుండా సినిమాలు లాగించేయొచ్చు. అయితే ఇదంతా భవిష్యత్తులో కార్యరూపం దాల్చడానికి పది ఇరవై సంవత్సరాలు పట్టొచ్చు. అదే జరిగితే కొన్ని వేల కార్మికుల, సాంకేతిక నిపుణుల జీవనోపాధి రిస్కులో పడుతుంది. ఒక డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని ఓ పది మంది పని చేస్తే చాలు కోటి రూపాయల్లో ఏఐ సినిమా తీయొచ్చు. దాని వల్ల కలిగే ప్రమాదమే ఎక్కువ.

ప్రస్తుతానికి ఎలాంటి భయం లేదు కానీ రాబోయే పరిణామాలను తక్కువంచనా వేయలేం. ఇంటర్నెట్ లేని రోజుల్లో దూర దర్శనే మహాద్భుతంగా తోచేది. ఓటిటి విప్లవాన్ని ఎవరూ ఊహించలేదు. ఎస్టిడి బూతులు పోయి 4జి స్మార్ట్ ఫోన్లు వస్తాయని గెస్ చేసింది ఎవరు. బయటికి వెళ్లే అవసరం లేకుండా వంద ఇంచుల టీవీల రూపంలో హోమ్ థియేటర్ల రూపకల్పనను ఎవరు సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ ఏఐ కూడా ఫ్యూచర్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే అందరూ దానికి సన్నద్ధంగా ఉండటం మాత్రం అవసరమే.