ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి సినిమా హాళ్లలో ప్రదర్శనలు ఉండబోవని.. సినిమా హాళ్లను మూసేస్తామని ప్రకటించిన ఎగ్జిబిటర్ల సంఘం తాజాగా వెనక్కి తగ్గింది. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. సినిమా హాళ్లు యధావిధిగా పనిచేయనున్నాయని ప్రకటించింది. అంతేకాదు.. దీనిపై స్పష్టత వచ్చిందని కూడా ప్రకటించింది. తాజాగా ఎగ్జిబిటర్ల సంఘం, ఫిలించాంబర్ సభ్యులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జూన్ 1 నుంచి సినిమా హాళ్లను బంద్ చేస్తామని గతంలో చేసిన ప్రకటనపై వారు చర్చించారు. వాస్తవానికి సినిమాల పై ఎగ్జిబిటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ సమస్యలు పరిష్కరిం చాలని కూడా డిమాండ్ చేస్తోంది. గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సినీ ప్రముఖులు కలిసి వెళ్లారు. అయినా.. వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నది వారి వాదన. ఈ నేపథ్యంలోనే బంద్‌కు పిలుపునిచ్చారు.
అయితే.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు జూన్ 12 న విడుదల అవుతున్న నేపథ్యంలోనే బంద్‌కు పిలుపునిచ్చారని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనసేన నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఇది కుట్రపూరిత నిరసన అని.. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని కూడా.. నాయకులు వ్యాఖ్యానించారు.
మరో వైపు మంత్రి కందుల దుర్గేష్. .. అసలు ఈ బంద్ నిర్ణయం వెనుక ఏం జరిగిందో వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబా ద్‌లో భేటీ అయిన ఫిలిం చాంబర్.. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. యధావిధిగా హాళ్లు రన్ అవుతాయని ప్రకటించింది. అయితే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపింది.