వచ్చే వారం మే 30 రీ రిలీజ్ కాబోతున్న ఖలేజా అడ్వాన్స్ బుకింగ్స్ మతులు పోగొట్టేలా ఉన్నాయి. వారం రోజుల ముందుగానే బుక్ మై షోలో మళ్ళీ విడుదలవుతున్న సినిమాకు గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే మొదటిసారి. మాములుగా క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ సైతం కొన్ని సార్లు ఇంత దూకుడు చూపించవు. అలాంటిది ఖలేజాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు అప్పటికప్పుడు షోలు యాడ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే డేట్ దగ్గర పడేకొద్దీ ఈ అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. నిజంగా ఇది ట్విస్ట్.
ఖలేజాకు ఇంత క్రేజ్ ఉండటానికి కారణాలున్నాయి. ఒరిజినల్ గా విడుదలైన టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన మూవీ ఇది. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ మీదున్న విపరీతమైన అంచనాలను మోయలేక ఫ్లాప్ అనిపించుకుంది. హీరోని దేవుడిగా క్యారెక్టర్ గా డిజైన్ చేసిన దర్శకుడు దాన్ని మాస్ కి అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఏడారిలో నడిపించిన ఎపిసోడ్ వల్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. థియేటర్ రన్ పూర్తయ్యాక క్రమంగా ఖలేజాకు కల్ట్ స్టేటస్ రావడం మొదలయ్యింది. శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం మొదలయ్యాక జనాలు ఆదరించడం మొదలుపెట్టారు.
చాలా కాలం నిర్మాతలకున్న ఆర్థిక వివాదాల వల్ల ఖలేజా టీవీ టెలికాస్ట్ కు కూడా నోచుకోలేదు. ఓటిటిలో రాలేదు. డివిడి రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత హక్కులను జెమిని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి కల్ట్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. టీవీలో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకున్నారు. పోకిరి రీ రిలీజ్ తర్వాత నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక ఫలించింది. ఇదంతా ముందే ఎక్స్ పెక్ట్ చేసిన అతిథి నిర్మాతలు తమ రీ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.