=

రానా నాయుడు.. అది గుర్తుందిగా

తెలుగులో అనేక ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలతో ట్రెండ్ సెట్ చేసిన హీరో.. విక్టరీ వెంకటేష్. మన ఇండస్ట్రీ నుంచి వెబ్ సిరీస్‌లో నటించిన తొలి పెద్ద హీరోగానూ ఆయన రికార్డు నెలకొల్పారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ఆయన నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన సిరీస్.. రానా నాయుడు. ‘రే డొనోవన్’ అనే అమెరికన్ టీవీ సిరీస్ ఆధారంగా దీన్ని రూపొందించారు. వెంకీ నటించిన తొలి వెబ్ సిరీస్ అని ఎంతో ఆసక్తిగా ‘రానా నాయుడు’ చూసిన ఆయన అభిమానులకు పెద్ద షాకే తగిలింది.

బేసిగ్గా వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటి వాళ్లందరూ ఇందులో వెంకీ పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ఆయన నోటి నుంచి వచ్చిన బూతు డైలాగులు.. సిరీస్‌లోని అడల్ట్ కంటెంట్ చూసి తట్టుకోలేకపోయారు. ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్‌కు కొంచెం అలవాటు పడ్డ వాళ్లు కూడా.. వెంకీని ఇలాంటి పాత్ర, సిరీస్‌లో చూడలేకపోయారు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌కు వ్యూయర్‌షిప్ బాగానే వచ్చినా.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో కనిపించింది. వెంకీ, రానాల వరకు ఈ ఫీడ్ బ్యాక్ వెళ్లింది కూడా. టీం ఈ నేపథ్యంలో సీజన్-2 విషయంలో టీం జాగ్రత్త పడిందనే అనుకుంటున్నారు.

రానా నాయుడు సీజన్-2 జూన్ 13 నుంచే స్ట్రీమ్ కాబోతోంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక దీని ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇందులో కంటెంట్ ఎలా ఉండబోతోందీ ట్రైలర్‌తోనే ఒక క్లారిటీ వచ్చేయొచ్చు. అది చూసే వెంకీ ఫ్యాన్స్ సిరీస్ చూడాలా లేదా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారని భావించవచ్చు. మరీ సంప్రదాయబద్ధంగా సిరీస్ ఉండాలని ఎవ్వరూ కోరుకోరు కానీ.. సీజన్-1తో పోలిస్తే కొంచెం డోస్ తగ్గిస్తే చాలని అనుకుంటున్నారు. మరి ట్రైలర్‌తో ‘రానా నాయుడు’ టీం ఏం హింట్ ఇస్తుందో చూడాలి.