పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సీనియర్ నిర్మాత ఏఎం రత్నంకు ఉన్న అనుబంధమే వేరు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఖుషి’ సాధించిన వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు ఏర్పడిన అనుబంధం రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ ఉంది. ఐతే ‘ఖుషి’ తర్వాత మళ్లీ వీరి కలయికలో ఓ బ్లాక్ బస్టర్ చూడాలని అభిమానులు కోరుకున్నారు కానీ.. అది సాధ్యపడలేదు. తర్వాతి చిత్రం ‘బంగారం’ డిజాస్టర్ అయింది. మళ్లీ సినిమానే సాధ్యపడలేదు. ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’తో పవన్-రత్నం జోడీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో రత్నం మాట్లాడుతూ.. పవన్‌తో తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఖుషి తర్వాత మేమిద్దరం కలిసి ‘బంగారం’ చేశాం. మళ్లీ సినిమా చేయాలని అనుకున్నాం. వెంటనే పవన్ కళ్యాణ్ గారి స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ అనౌన్స్ చేశాం. దానికి పూజ కూడా జరిగింది. సత్యాగ్రహి అనగానే మనందరికీ గాంధీ గారు చేసిన సత్యాగ్రహం గుర్తుకు వస్తుంది. కానీ పవన్ గారు నాకు చెప్పిన కాన్సెప్ట్ వేరు. ఏదైనా అన్యాయం జరిగితే ఆగ్రహించే వ్యక్తి కథ అది. సత్య ఆగ్రహి అన్నది ఆ టైటిల్ అర్థమన్నారు. అది విని ఆశ్చర్యపోయాను. అది పవన్ గారే డైరెక్ట్ చేయాల్సిన సినిమా. కానీ ఆయనకు కుదరక ఆగిపోయింది. మల్లీ చాలా ఏళ్లకు ‘వేదాళం’ రీమేక్ తీద్దామని అనుకున్నాం.
మా అబ్బాయి జ్యోతికృష్ణనే డైరెక్ట్ చేయాల్సింది. పవన్ గారు కూడా అతణ్నే సినిమా చేయమన్నారు. కానీ జ్యోతికృష్ణ ‘ఆక్సిజన్’లో బిజీగా ఉండి ఆ సినిమా చేయలేకపోయాడు. కొన్నేళ్ల తర్వాత క్రిష్ గారు ‘హరిహర వీరమల్లు’ లైన్ చెప్పారు. నా జడ్జిమెంట్‌ను నమ్మి పవన్ గారు ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఐతే సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. రెండు కరోనాలు వచ్చి వెళ్లాయి. ఇలా లేట్ కావడంతో మా అబ్బాయి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఒక రకంగా అతను నాకు సాయం చేశాడని చెప్పొచ్చు. రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. ఇది గొప్ప సినిమా అవుతుంది’’ అని రత్నం అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates