మాములుగా స్టార్ కుటుంబ సభ్యులు ఎవరైనా నిర్మాతలుగా మారితే వాళ్ళ స్వంత హీరోలతోనే సినిమాలు తీయడం పరిపాటి. ఇది అన్ని భాషల్లోనూ ఉన్నదే. మెగా, నందమూరితో మొదలుపెట్టి బాలీవుడ్ రాజ్ కపూర్ ఫ్యామిలీ దాకా ఇది చాలా మాములు విషయం. లాభమో నష్టమో అంతా మాకే ఉంటుందనే సిద్ధాంతంతో దీన్ని ఫాలో అవుతారు. కానీ యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ ఆలోచన వేరేలా ఉంది. ఆవిడ స్వంతంగా పిఏ ప్రొడక్షన్స్ పేరుతో ఒక బ్యానర్ స్థాపించి కొతలవాడి పేరుతో ఒక మూవీ తీస్తున్నారు. దీనికి సంబంధించిన కబుర్లు పంచుకోవడానికి తెలుగు మీడియాతో బెంగళూరులో ప్రత్యేకంగా మాట్లాడారు.
అందులో భాగంగా మా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ యష్ తో మాత్రం సినిమా తీయనని చెప్పేశారు. కడుపు నిండిన వాడికి అన్నం, బోడి తలతో ఉన్నవాడికి కొబ్బరినూనె ఇవ్వకూడదని పెద్దలు చెబుతారని, నేను దాన్నే పాటిస్తానని, యష్ కు ఆఫర్లు ఇచ్చే ప్రొడ్యూసర్లు, డబ్బిచ్చే నిర్మాతలు వేరే ఉన్నారని, తాను మాత్రం కొత్తవాళ్లకు ప్రతిభ ఉన్న ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇస్తానని కుండబద్దలు కొట్టేశారు. సో తల్లితండ్రుల పేరు మీదున్న సంస్థలో యష్ నటించే అవకాశం లేదన్న మాట. ఖచ్చితంగా ఇదే మాట మీద ఉంటారా అంటే ప్రస్తుతానికి ఇంత క్లారిటీతో చెప్పారు కాబట్టి బహుశా ఛాన్స్ లేకపోవచ్చు.
కొతలవాడిలో పృథ్వి అంబార్ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు అందరూ అప్ కమింగ్ వాళ్లే నటిస్తున్నారు, పని చేస్తున్నారు. యష్ బ్రాండ్ ని ఎక్కడ వాడటం కానీ బిజినెస్ కోసం ఉపయోగించుకోవడం కానీ చేసే ఉద్దేశంలో పుష్ప అరుణ్ కుమార్ లేరట. బాగుంది. లేట్ వయసులో నిర్మాతగా తనను తాను ఋజువు చేసుకొవడం కోసం ఆవిడ పడుతున్న తాపత్రయం మెచ్చుకోదగినదే. అన్నట్టు తెలుగు చక్కగా మాట్లాడే పుష్ప గారికి టాలీవుడ్ లోనూ సినిమాలు తీసే ఆలోచన ఉందట. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టిన బ్యానర్ కనక మంచి సాలిడ్ హిట్లు పడితే ఎక్కువ చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది.