స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ ట్రెండ్ ఇప్పటిది కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి మహేష్ బాబు దాకా అందరూ ఫాలో అవుతున్నదే. పుష్పలో ఈ పాటలు ఎంతగా ప్లస్ అయ్యాయో చూశాం. అలాంటిదే హరిహర వీరమల్లులో కూడా ఉంది. తార సితార అంటూ సాగే ఈ పాటను కీరవాణి కంపోజ్ చేశారు. రికార్డింగ్ అయ్యాక పాట విన్న పవన్ కళ్యాణ్ కొన్ని లైన్లు అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయని, ఇప్పుడు తానున్న బాధ్యతలో, పదవిలో ఇలాంటి పెట్టడం సబబు కాదని, మార్చమని కోరారు. దీంతో ఆయన నిబద్దతతో ఆశ్చర్యపోయిన వీరమల్లు బృందం వెంటనే వాటిని సరిచేసి మళ్ళీ రికార్డింగ్ చేయించింది.
ఇదంతా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో స్వయంగా కీరవాణే వివరించారు. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్, కొన్ని పాటల్లో స్టెప్పులు వివాదాలు తీసుకురావడం చూస్తున్నాం. కొన్నిసార్లు హీరోలు వీటి పట్ల మౌనంగా ఉంటూ వాటికొచ్చే కాంట్రావర్సి పబ్లిసిటీని ఎంజాయి చేసిన దాఖలాలు లేకపోలేదు. కానీ పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా అడిగి మరీ లిరిక్స్ మార్పించడం చిన్న విషయం కాదు. ఇంతకన్నా డీటెయిల్స్ కీరవాణి చెప్పలేదు కానీ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న పాట విడుదల ఇదే కానుందని సమాచారం. మెల్లగా ఆడియో పరంగా అంచనాలు పెంచుకుంటున్న హరిహర వీరమల్లు జూన్ 12 విడుదలకు రెడీ అవుతోంది.
మరో విశేషం ఏంటంటే కీరవాణి, పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇదే. పవన్ కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందిన పీరియాడిక్ డ్రామా కూడా ఇదే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ ఔరంగజేబుగా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. మొఘలుల దురాగతాలు తెలుగు రాష్ట్రాల్లో పెచ్చు మీరినప్పుడు వాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వీరుడి గాథగా వీరమల్లు తెరకెక్కింది. తొలుత దర్శకత్వం క్రిష్ వహించగా తర్వాత ఆ బాధ్యతని ఏఎం రత్నం అబ్బాయి జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. అంచనాలైతే క్రమంగా పెరుగుతున్నాయి. అందరి చూపు రాబోయే ట్రైలర్ మీద ఉంది.