టాలీవుడ్లో అత్యంత అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా మంచు ఫ్యామిలీకి పేరుండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. కొంత కాలంగా ఆ కుటుంబ గొడవ ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఇటీవల అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని.. రోడ్డు మీదికి వచ్చేశాయి. నెలలు గడుస్తున్నా గొడవ సద్దుమణగలేదు. మనోజ్ నేరుగా విష్ణు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. విష్ణు మాత్రం దీని గురించి మీడియాతో నేరుగా మాట్లాడట్లేదు. ఐతే తాజాగా తన కొత్త చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విష్ణు.. పరోక్షంగా తన తమ్ముడిని టార్గెట్ చేశాడు. మనోజ్ పేరెత్తకుండానే ఆవేదన స్వరంతో తనకు కౌంటర్ ఇచ్చాడు.
‘కన్నప్ప’లో కీలక పాత్ర చేసిన ప్రభాస్ పెద్ద మనసు గురించి.. అతడితో తనకున్న స్నేహం గురించి మాట్లాడుతూ.. విష్ణు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. తనను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తితో ‘‘ఒకటి చెబుతాను.. మీరు వినాల్సిందే’’ అని అంటూ.. ‘‘రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటపుడు.. ప్రభాస్, నేను రక్తం పంచుకుని పుట్టలేదు. అయినా సరే నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా అతడికి రుణపడి ఉంటా’’ అని అన్నాడు విష్ణు.
తన కుటుంబ గొడవ హర్ట్ చేస్తోందా అని యాంకర్ అడిగితే.. ‘హర్ట్’ అనేది చిన్న పదం అని విష్ణు చెప్పాడు. ఈ గొడవ గురించి తన మనుసులో ప్రస్తుతం ఏమీ లేదని.. కేవలం తన తండ్రి సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ఆయన పడ్డ కష్టానికి ఒక కొడుకుగా తాను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా, చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలని అనుకుంటానని.. ఒకవేళ తాను ఆయనకు చెడ్డ పేరు తీసుకొస్తే ఒక కొడుకుగా తాను చచ్చినా ఒకటే బతికినా ఒకటే అని విష్ణు తేల్చేశాడు.