కన్నప్పకు అప్పుడే సెన్సార్ సమస్యలు

వచ్చే నెల జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు అప్పుడే సెన్సార్ సమస్యలు వస్తున్నాయా అంటే ఔననే అంటున్నాడు మంచు విష్ణు. ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ తాను పోషించిన భక్తుడి పాత్ర నోట్లో నీళ్లు పోసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేయడం గురించి సెన్సార్ బోర్డుకు అభ్యంతరాలు వస్తున్నాయని, ఈ మేరకు కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని అన్నాడు. అసలు ఇలా చేసే వాళ్ళ అజ్ఞానం చూస్తే నవ్వొస్తోందని, చరిత్ర తెలుసుకోకుండా ఊరికే బురద జల్లే ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు సినిమాకు ఎలాంటి నష్టం చేయవని ధీమా వ్యక్తం చేశాడు.

ఇంకో నలభై రోజుల్లోనే రిలీజ్ ఉన్న నేపథ్యంలో కన్నప్పకు సంబంధించిన ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి వచ్చేశాడు కాబట్టి తనకు సంబంధించిన డబ్బింగ్ త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. శ్రీకాళహస్తిలోని వేద పాఠశాలకు చెందిన పండితులకు కన్నప్ప చూపించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని అడిగామని, కానీ వాళ్ళు ఒక్క ఫ్రేమ్ మార్చే అవసరం లేనంత గొప్పగా చిత్రం వచ్చిందని మెచ్చుకున్నారని అన్నాడు. మోహన్ బాబు పోషించిన పాత్రకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవడం దగ్గరి నుంచి ఎన్నో అనుమానాలు తీర్చుకున్నామని వివరించాడు.

ప్యాన్ ఇండియా రిలీజ్ జరుపుకోబోతున్న కన్నప్పకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం, దేవరాజ్ తో పాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ పాత్రలు చాలా కీలకంగా నిలుస్తున్నాయి. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్న మంచు విష్ణు ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ డివోషనల్ గ్రాండియర్ ని నిర్మించాడు. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెబుతున్న విష్ణు త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నాడు. కృష్ణంరాజు తర్వాత భక్త కన్నప్ప కథను తీసుకున్న హీరో మంచు విష్ణు ఒక్కడే కావడం గమనార్హం.