కెజిఎఫ్ తో ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్ బాలీవుడ్ రామాయణంలో రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిక్ డ్రామా వచ్చే ఏడాది దీపావళి పండక్కు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు యష్ పారితోషికానికి బదులు భాగస్వామ్యం తీసుకున్నాడని బాలీవుడ్ రిపోర్ట్. ఎంతలేదన్నా నూటా యాభై కోట్ల దాకా వర్కౌటవ్వొచ్చని అంచనా. ఇటీవలే టాక్సిక్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన యష్ ప్రస్తుతం రామాయణం సెట్స్ లోనే ఉన్నాడు. అయితే రాముడు రన్బీర్ కపూర్ కు సీతగా సాయిపల్లవి కనిపిస్తే మరి రావణుడికి ఎవరనే డౌట్ రావడం సహజం కదా.
ఆయన భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ ని తీసుకునే ఆలోచనలో దర్శకుడు నితేశ్ తివారి ఉన్నట్టు తెలిసింది. ప్రాధమికంగా ఓకే అనుకున్నారని, అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించవచ్చని టాక్. ఇది నిజమైతే కాజల్ నక్క తోక తొక్కినట్టే. ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణు కన్నప్పలో శివుడు అక్షయ్ కుమార్ సరసన పార్వతి దేవిగా ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకుంది. ఇప్పుడు రామాయణంలో యష్ పక్కన అంటే సూపర్ ఆఫరని చెప్పాలి. బిడ్డకు తల్లయ్యాక ఆఫర్లు తగ్గిపోతాయనుకుంటున్న టైంలో ఇలాంటి ఛాన్స్ రావడం జాక్ పాటే. కాకపోతే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫలానా టైపు పాత్రలే చేస్తానని గిరిగీసుకుని లేదు. బాగుందనిపిస్తే చాలు ఒప్పేసుకుంటోంది. సల్మాన్ ఖాన్ సికందర్ చేయడానికి కారణం కూడా అదే. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టు భార్యగా కనిపించింది. భగవంత్ కేసరిలో బాలయ్య ప్రియురాలిగా చేశాక కాజల్ కు అంత పెద్ద అవకాశం మళ్ళీ రాలేదు. చూస్తుంటే ఇప్పుడు కెరీర్ ఊపందుకునేలా ఉంది. రామాయణంలో మండోదరికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఉండదు కానీ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఆమె మీద నడుస్తాయి. మరి వాటిని నితేష్ తివారి ఏ మేరకు పొందుపరిచారో సినిమా రిలీజయ్యేదాకా వేచి చూడాలి.