నిన్న సాయంత్రం భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. కమర్షియల్ గా ఇలాంటి సబ్జెక్టులు రిస్క్ అయినప్పటికీ ఎప్పటికి నిలిచిపోయే క్లాసిక్స్ కాబట్టి ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వెలువడింది. అందులోనూ నిర్మాణ భాగస్వామిగా రాజమౌళి వెనుకుండి నడిపిస్తే అంతకన్నా కావలసింది ఏముంటుంది. మహానటిని మించిన అద్భుతమైన డ్రామాని ఆశించవచ్చు. ఇది హఠాత్తుగా జరిగిన తతంగం కాదు. 2023 నుంచి ఒక ప్రణాళిక ప్రకారం దీని గురించిన చర్చలు జరుగుతున్నాయట.
ఈ టాపిక్ ఇంకా వేడిగా ఉండగానే ఇదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అక్టోబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్తారనే వార్త ముంబై మీడియాలో రావడంతో ఒక్కసారిగా అయోమయం ఏర్పడింది. తీయాలనుకోవడం మంచిదే కానీ ఇలా ఉన్నట్టుండి న్యూస్ బయటికి రావడమే విచిత్రం. 3 ఇడియట్స్, పీకే లాంటి క్లాసిక్స్ ఇచ్చిన హీరో డైరెక్టర్ కాంబో కావడంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున అంచనాలు నెలకొంటాయి. పైగా బయోపిక్స్ హ్యాండిల్ చేయడంలో హిరానీ ఎంత ఎక్స్ పర్టో సంజులో చూశాం కాబట్టి ఆయన నుంచి బెస్ట్ ఆశించడంలో తప్పు లేదు.
ఎవరు ముందు మొదలుపెడతారనే దానికన్నా ఎవరో ఒకరే చేస్తే బాగుంటుందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవరు దాదాసాహెబ్ ఫాల్కేగా నటించినా అది చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన కథకు ఇప్పటి తరంలో గొప్ప గుర్తింపు దక్కుతుంది. అలాంటప్పుడు ఒకరే చేయడం న్యాయం. అంతే తప్ప నువ్వా నేనా అంటూ క్లాష్ కావడం అనవసరం. తారక్ వర్షన్ కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ఈయన గతంలో ఆవారాపన్, రామ్ సింగ్ చార్లీ, జవానీ జానెమన్ లాంటి సినిమాలు తీశారు. చూడాలి మరి ఈ ఫాల్కేల పరుగులో ఎవరిది ముందు చేయి అవుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates