-->

ఆర్ఆర్ఆర్-2.. మాకు నమ్మకం లేదు దొరా

మూడేళ్ల కిందట ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ స్థాయిలో ఎలాంటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ముందు ఈ సినిమా చూసిన మన ప్రేక్షకులు రాజమౌళి చివరి చిత్రం ‘బాహుబలి’ స్థాయిలో లేదని పెదవి విరిచారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘనవిజయమే సాధించింది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకోవడంతో అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ పేరు మార్మోగింది. ఇక అప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్-2’ గురించి చర్చ జరుగుతూనే ఉంది. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ఒకట్రెండు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా రాజమౌళి సైతం లండన్లో జరిగిన ఓ ఈవెంట్లో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ ఉంటుందన్నట్లుగా మాట్లాడారు.

దీంతో ‘ఆర్ఆర్ఆర్-2’ పక్కా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ నెటిజన్లు మాత్రం ‘మాకు నమ్మకం లేదు దొరా’ అనే మీమ్‌తో ఈ వార్తలకు కౌంటర్లు ఇస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ అయినా.. రాజమౌళి అయినా.. ఏదో ఆ సమయానికి సీక్వెల్ గురించి అడిగితే.. చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారే తప్ప.. నిజంగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా అన్నది ప్రశ్న. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజయ్యాక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఏళ్ల తరబడి ఎలా కొట్టుకుంటున్నారో తెలిసిందే. హీరోల పాత్రల ప్రాధాన్యానికి సంబంధించి హెచ్చు తగ్గుల గురించి ఎడతెగని చర్చ సాగింది. ఈ వ్యవహారం చూశాక ఇంకోసారి ఇలా పెద్ద హీరోలతో మల్టీస్టారర్లు చేయడమే తప్పు అన్న ఫీలింగ్ రాజమౌళికే కాక చాలామంది ఫిలిం మేకర్లకు కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు.

‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ చేయకుండా ఉండడానికి దీనికి మించిన కారణం అక్కర్లేదు. మరోవైపు రాజమౌళి, చరణ్, తారక్ ఎవరికి వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ముగ్గురూ వీలు చేసుకుని ‘ఆర్ఆర్ఆర్-2’ చేయాలంటే చాలా సమీకరణాలు కలిసి రావాలి. ఇంకోవైపు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ పట్టాలెక్కడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని.. మహేష్ సినిమా తర్వాతైనా ఆ పనులు మొదలుపెట్టాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. జక్కన్న కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్-2’ నిజంగా ఉంటుందా అన్నది సందేహమే.