ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా బాధ్యతల మధ్య కొంచెం వీలు చేసుకుని దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘హరి హర వీరమల్లు’ బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేశారు. దీంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే పవన్ అభిమానుల దృష్టి దీని కంటే ‘ఓజీ’ మీదే ఎక్కువగా ఉంది. ఆ సినిమా షూట్‌ కూడా పున:ప్రారంభం అవడంతో వారిలో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. రీఎంట్రీలో పవన్ చేస్తున్న చిత్రాల్లో అత్యంత హైప్ తెచ్చుకున్నది ఇదే. దీన్ని ఎంత త్వరగా పూర్తి చేసి రిలీజ్‌ చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఐతే ఎట్టకేలకు షూట్ పున:ప్రారంభం అవుతుండడం.. సెప్టెంబరులో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తుండడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఒక సినిమా పూర్తి చేసి.. ఇంకో మూవీ చిత్రీకరణకూ పవన్ హాజరవుతుండడంతో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతుండగా.. ఇప్పుడు ఇంకో కబురు కూడా వినిపిస్తోంది. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణకు కూడా సన్నాహాలు చేసుకోమని పవన్ చెప్పాడట.

పవన్ పెండింగ్‌లో పెట్టిన చిత్రాల్లో తక్కువ షూట్ జరుపుకున్నది, అసలు పూర్తవుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నది ఈ సినిమా విషయంలోనే. పవన్ మళ్లీ షూటింగ్‌లకు హాజరైనా ‘ఉస్తాద్’ ఆయన ప్రయారిటీ లిస్టులో లేదనే అనుకున్నారంతా. కానీ వీలైనంత త్వరగా ‘ఓజీ’ని పూర్తి చేసి వస్తానని.. ఈ ఏఢాది సెకండాఫ్‌లో సినిమాను లాగించేద్దామని పవన్ మైత్రీ అధినేతలకు చెప్పినట్లు సమాచారం. జూన్ లేదా జులైలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘ఉస్తాద్’ పక్కకు వెళ్లిపోవడంతో మధ్యలో ‘మిస్టర్ బచ్చన్’ చేసిన హరీష్.. ఇంకో సినిమాను కూడా లైన్లో పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘ఉస్తాద్’కే మోక్షం లభిస్తుండడంతో ఇక వేరే సినిమా చేయాల్సిన అవసరం లేనట్లే.