వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతూ వచ్చిన హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం చివరి ఘట్టానికి చేరుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 13 ఈ ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు సమాచారం. బయ్యర్ల దగ్గర బిజినెస్ డీల్స్ పూర్తి చేయడానికి రిలీజ్ డేట్ కీలకం కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ముందు జూన్ మొదటి వారమే అనుకున్నారు కానీ టైం సరిపోదనే ఉద్దేశంతో రెండో వారానికి షిఫ్ట్ అయినట్టు ఇన్ సైడ్ న్యూస్.
ఒకరకంగా ఇది మంచి డేటే. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కమల్ హాసన్ తగ్ లైఫ్ వస్తుంది. జూన్ 20 కుబేర ఉంది. ఆపై వారం 27 కన్నప్ప దిగుతాడు. సో ఉభయకుశలోపరి సూత్రం ప్రకారంగా ఇది సేఫ్ గేమ్ అవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఎంతలేదన్నా రెండు వారాలకు పైగానే స్ట్రాంగ్ రన్ రాబడతాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే నెల రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. టీమ్ అయితే ఆ నమ్మకంతోనే ఉంది. ప్రస్తుతం ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కన్సర్ట్ కోసం లండన్ వెళ్లిన కీరవాణి తిరిగి రాగానే రీ రికార్డింగ్ మొదలుపెట్టాలి. విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పిరిట్ వర్సెస్ స్వోర్డ్ కు రంగం సిద్ధమైనట్టే. ఓజి ఎలాగూ సెప్టెంబర్ లో వచ్చే సూచనలు ఉన్నాయి కనక మధ్యలో మూడు నెలల గ్యాప్ సరిపోతుంది. కాకపోతే ఇది కనక జరిగితే ఇంత తక్కువ నిడివిలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కావడం మొదటిసారి అవుతుంది. ట్రైలర్ చూశాక అంచనాలు పెరుగుతాయని, ఎక్కడైనా నెగటివ్ బజ్ లాంటిది ఏదైనా ఉంటే దీంతో పూర్తిగా మాయమవుతుందని టీమ్ టాక్. క్రిష్, జ్యోతికృష్ణలు విడివిడిగా సంయుక్త దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంగజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు.