ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ సినిమాలన్నీ దాదాపుగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఏవో కొన్ని పాన్ ఇండియా సినిమాలకు తప్ప నెల రోజులకు మించి విండో ఉండట్లేదు. కొన్ని సినిమాలను మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయ్యాక ముందు చేసుకున్న ఒప్పందాన్ని రివైజ్ చేసి ఇంకా ముందే డిజిటల్‌గా రిలీజ్ చేసిన సినిమాలున్నాయి. ఐతే అరుదుగా కొన్ని సినిమాల విషయంలో మాత్రం డిజిటిల్ రిలీజ్ వాయిదా పడుతుంటుంది.
థియేటర్లలో బాగా ఆడుతుండడంతో ఒప్పందాలు మార్చి.. కొంచెం ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. గత ఏడాది చాలా పెద్ద హిట్ అయిన ‘అమరన్’ సినిమా విషయంలో ఇలాగే చేశారు. రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో చిత్రం ఇదే బాటలో నడవబోతోంది. మలయాళంలో ఇటీవల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మోహన్ లాల్ సినిమా ‘తుడరుమ్’ను ముందు అనుకున్నట్లు ఈ నెల చివరి వారంలో డిజిటల్‌గా రిలీజ్ చేయట్లేదు.
గత నెల 25న పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదిరే టాక్ తెచ్చుకుని అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. రూ.200 కోట్ల వసూళ్లకు ఆ సినిమా చేరువగా ఉంది. ఒక్క కేరళలోనే వంద కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు కూడా నెలకొల్పింది. విడుదలైన మూడో వారంలోనూ సినిమా జోరు తగ్గట్లేదు. దాని ఊపు చూస్తే ఇంకో రెండు వారాలు మంచి వసూళ్లు రాబట్టేలా ఉంది.
ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఓటీటీ సంస్థతో డిజిటిల్ రిలీజ్ ఒప్పందాన్ని రివైజ్ చేస్తున్నారట. ముందు అనుకున్నట్లు థియేట్రికల్ రిలీజ్ నుంచి నాలుగు వారాలు కాకుండా ఇంకో రెండు వారాలు ఆలస్యంగా సినిమాను ఓటీటీలోకి తేబోతున్నారట. ఇందుకోసం డిజిటల్ డీల్ హక్కుల రేటు కొంత తగ్గినా.. థియేటర్లలో ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో అది కవర్ అయిపోతుందన్నమాట.