బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని గొప్ప సినిమాలు తీసి మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. కానీ గత దశాబ్ద కాలంలో దర్శకుడిగా అనురాగ్ బాగా డౌన్ అయిపోయాడు. తన సినిమాలు ఆడకపోడం, బాలీవుడ్ పోకడలు నచ్చకపోవడంతో నెమ్మదిగా సినిమాలు తీయడమే మానేశాడు. ప్రస్తుతం నటుడిగానే బిజీగా కనిపిస్తున్నాడు. అతను వరుసగా తమిళంలోనే నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇమైక్క నోడిగల్, లియో లాంటి చిత్రాల్లో తన పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇక మహారాజాలో అనురాగ్ చేసిన విలన్ పాత్రకైతే మామూలు రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా పెద్ద హిట్ కావడంలో అనురాగ్ పాత్ర, తన నటన కీలక పాత్ర పోషించాయి.
ఐతే ఈ సినిమాలో తాను నటించడానికి ఇష్టపడకపోయినా.. విజయ్ సేతుపతి బలవంతంగా యాక్ట్ చేయించానని.. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతోనే తన కూతురి పెళ్లి చేయగలిగానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తెలిపాడు. తనకు నటుడు కావాలన్న ఆసక్తి పెద్దగా లేకపోయినా.. దర్శకుడిగా గ్యాప్ వచ్చిన సమయంలో ఇమైక్క నోడిగల్‌తో ముఖానికి రంగేసుకున్నట్లు అనురాగ్ తెలిపాడు.
ఆ సినిమా తర్వాత ఒక సందర్భంలో విజయ్ సేతుపతిని కలిశానని.. తనతో స్నేహం పెరిగిందని.. అలా ఓ సందర్భంలో తన కూతురి పెళ్లికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తనతో చెబితే.. తాము సాయం చేస్తానని సేతుపతి చెప్పాడన్నాడు అనురాగ్. ఆ మాటను గుర్తుంచుకుని మహారాజ సినిమాలో విలన్ పాత్రకు తనను సంప్రదించాడని.. కానీ తనకు నటన మీద ప్రస్తుతం ఆసక్తి లేదని చెబుతూ, తాను ఆ క్యారెక్టర్‌ను తిరస్కరించానని అనురాగ్ గుర్తు చేసుకున్నాడు. కానీ సేతుపతి పట్టుబట్టి తనతో ఆ పాత్ర చేయించాడని.. ఆ సినిమాకు పారితోషకం కింద వచ్చిన డబ్బులతోనే తన కూతురి పెళ్లి చేశానని అనురాగ్ తెలిపాడు. మహారాజాలో తన పాత్ర, నటనకు కూడా మంచి పేరే వచ్చాయని.. దాని వల్లే ఇప్పుడు బిజీ నటుడిగా మారానని అనురాగ్ తెలిపాడు.