హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఓజి ఈ నెల 14 నుంచి రెండు వారాల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపబోతున్నట్టు సమాచారం. తొలుత బ్యాంకాక్, థాయిలాండ్ లో అనుకున్న షెడ్యూల్స్ ని తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో ప్లాన్ చేసినట్టు తెలిసింది. అవసరమైన మేరకు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని వాడి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయబోతున్నారు. దీని కోసం దర్శకుడు సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పవన్ డేట్లు మళ్ళీ అవసరం పడకుండా పజాగ్రత్త పడినట్టు ఇన్ సైడ్ న్యూస్.
ఒకవేళ అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగితే ఇంకో నాలుగు నెలల్లో అనుకుంటున్న ఓజి రిలీజ్ సాధ్యమయ్యేలా ఉంది. సెప్టెంబర్ 5 లేదా నెలాఖరున దసరా పండగ అంటూ రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓజి థియేట్రికల్ రిలీజ్ ఈ ఏడాదిలోనే అయిపోవాలి. దానికి అనుగుణంగానే నిర్మాత డివివి దానయ్య సర్వం సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటిదాకా షూట్ చేసిన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ జరిగిపోతోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు జూలై లేదా సాధ్యమైతే అంతకన్నా ముందే మొదలుపెట్టే అవకాశాలున్నాయి. పూర్తి క్లారిటీ కోసం ఇంకా వేచి చూడాలి.
ఓజాస్ గంభీర పేరుతో ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హిరోయిన్ గా నటించింది. ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఓజి రెండు భాగాలా లేక సింగల్ పార్టా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత వేగంగా బాలన్స్ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల మీద పూర్తి దృష్టి పెట్టే ఆలోచనలో పవన్ ఉన్న నేపథ్యంలో కొత్త కమిట్ మెంట్లు ఏవీ ఉండకపోవచ్చు. ఒకవేళ హరిహర వీరమల్లు, ఓజి రెండూ 2025లోనే రిలీజైతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది ఉంటుంది. దానికి ఎన్ని డేట్లు అవసరమవుతాయనేది ఇంకో రెండు మూడు నెలల్లో తేలొచ్చు.