హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా పరుగులు పెడుతోంది. మే ఎనిమిది లేదా తొమ్మిది తేదీల్లో గుమ్మడికాయ కొట్టడం దాదాపు ఫిక్స్. ఇక డబ్బింగ్ ఇతరత్రా కార్యక్రమాలు మూడో వారంలోగా పూర్తి చేయాలనేది టార్గెట్. ఇప్పుడు అసలు సవాల్ విడుదల తేదీ. మే 30 కింగ్ డమ్ ఉంది. ఒకవేళ అదే తేదీ కావాలనుకుంటే సితార సంస్థ వాయిదా వేసుకోవడానికి వెనుకాడదు. కాకపోతే వీలైనంత ముందుగా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా కొత్త డేట్ ఏది వేసుకోవాలో విజయ్ దేవరకొండ టీమ్ ప్లాన్ చేసుకుంటుంది.
లేదూ వీరమల్లు జూన్ మొదటి వారంలో రావాలంటే కమల్ హాసన్ తగ్ లైఫ్ ఉంది. దాని వల్ల తెలుగు వర్షన్ కొచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళలో పవన్ సినిమాని మార్కెట్ చేసుకోవడం, థియేటర్లు దక్కించుకోవడం కష్టమవుతుంది. పైగా బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వీరమల్లు ప్రమోషన్ల మీద దృష్టి పెట్టేందుకు అవసరమైనంత సమయం దక్కేలా చూసుకోవడం అవసరం. అలాంటప్పుడు కమల్ తో క్లాష్ ఎంతవరకు సేఫనేది రకరకాల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. అదే నెలలో కుబేర, కన్నప్పలు ఉన్నాయి. ఒకవేళ పవన్ వస్తానంటే నాగార్జున, మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎందుకంటే కన్నప్ప, కుబేరలు కూడా ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురయ్యాయి. ఇంతకన్నా లేట్ చేయడానికి లేదు. ఒకవేళ వీటిలో ఏదైనా లేదా హరిహరవీరమల్లు కనక జూన్ వద్దనుకుంటే మిగిలింది జూలై ఒక్కటే. ఆగస్ట్ లో వార్ 2, కూలి దృష్ట్యా ఛాన్స్ లేదు. పార్ట్ 2 బిజినెస్ కు పార్ట్ 1 సక్సెస్ కీలకం కాబట్టి వీరమల్లుకి సోలో రిలీజ్ చాలా ముఖ్యం. నిర్మాత ఏఎం రత్నం వీలైనంత వరకు అదే ప్రయత్నంలో ఉన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. పవన్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ కొంత పర్యవేక్షణ చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ అదేమీ లేదు. కేవలం పలకరింపు కోసమే వచ్చారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates