విశ్వక్ మిస్సయ్యాడు….ఫ్యాన్స్ ఫీలయ్యారు

హిట్ 3 ది థర్డ్ కేస్ లో అడవి శేష్ క్యామియో ఉందనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే స్టంట్ మాస్టర్ ద్వారా లీకైపోయింది. అది చూడని వాళ్లకు సర్ప్రైజ్ అనిపించింది కానీ ముందే ప్రిపేరైన ఫ్యాన్స్ దాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. అయితే హిట్ మొదటి భాగంలో విక్రమ్ రుద్రరాజుగా ఇంటెన్స్ షేడ్ చూపించిన విశ్వక్ సేన్ కూడా ఉంటే చాలా బాగుండేదని అభిమానులు ఫీలవుతున్నారు. పార్ట్ 1 తాలూకు టీజర్ విజువల్స్ ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ తమ వెలితిని తెలియజేస్తున్నారు. నిజంగానే విశ్వక్ ఫిల్మోగ్రఫీలో బెస్ట్ అనిపించుకునే మూవీస్ లో హిట్ స్థానం చాలా ప్రత్యేకమని ఎవరైనా ఒప్పుకుంటారు.

మరి దర్శకుడు శైలేష్ కొలను అడగలేదో లేక విశ్వకే వద్దన్నాడో తెలియదు కానీ ముగ్గురు వయొలెంట్ పోలీస్ ఆఫీసర్లను ఒకే ఫ్రేమ్ లో చూపించే ఛాన్స్ మాత్రం మిస్సయ్యింది. గత వారం ఈవెంట్ కొచ్చిన విశ్వక్ ఎంతకాదనుకున్నా హిట్ తన ముద్దుబిడ్డగా చెప్పుకోవడం కొన్ని అనుమానాలు రేపింది. అంటే ఏమైనా విభేదాల వల్ల హిట్ ప్రపంచానికి దూరమయ్యాడా లేక ఇంకేదైనా మతలబు ఉందా అనే కోణంలో ఫ్యాన్స్ చర్చించుకున్నారు. కానీ సమాధానం దొరకని ప్రశ్న అది. హిట్ 4 ది ఫోర్త్ కేస్ లో హీరో కార్తీ కాబట్టి మళ్ళీ ఈ కలయిక చూసే ఛాన్స్ దక్కుతుందో లేదో ఒక్క శైలేష్ కొలనుకు మాత్రమే తెలిసిన రహస్యం. ఐతే హిట్ 3 కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక పార్ట్ లో మాత్రం అందర్నీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే ఐడియా ఒకటి ఉందని, కానీ అది ఏ పార్ట్ లో శైలేష్ చేస్తాడో తనకి కూడా తెలియదని నాని చెప్పడంతో రాబోయే హిట్ సినిమాల్లో విశ్వాక్ తప్పకుండా దర్శనమిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

లైలా దెబ్బకు బాగా డల్ అయిపోయిన విశ్వక్ సేన్ మునుపటి జోష్ చూపించని వైనం పలు సందర్భాల్లో కనిపిస్తోంది. ఈసారి హిట్టు కొట్టాకే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు కాబోలు. అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫంకీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత కామెడీ టింజ్ ఉన్న క్యారెక్టర్ గా దీని గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ ప్రకారం ఇందులో విశ్వక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తాడట. వన్ లైనర్లు, పంచులతో నవ్వులు పూయించే అనుదీప్ ఈసారి విశ్వక్ ని ఎలా వాడుకుంటాడో చూడాలి. కల్ట్ అనే మరో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రకటన త్వరలోనే రాబోతోంది.