గత ఏడాది డిసెంబర్లో ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప 2 తెలుగులో కంటే హిందీలోనే భారీ వసూళ్లు తెచ్చిందనేది వాస్తవం. ఫిగర్లు కూడా దాన్నే స్పష్టం చేశాయి. నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి బాలీవుడ్ స్టార్లు ఆశ్చర్యపోయారు. క్రికెట్ గ్రౌండ్స్ లో డేవిడ్ వార్నర్, నితీష్ కుమార్ రెడ్డి, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆ మ్యానరిజంస్ ని ఫాలో అయ్యారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పాలా. పుష్ప 2 ఏపీ, తెలంగాణలో భారీ లాభాలు తెచ్చింది అంతకు ముందు పుష్ప 1 కొన్ని ప్రాంతాల్లో కొంచెం కష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం నాగార్జున.
టాప్ స్టార్స్ అందరిని ఒకే చోటికి చేరుస్తున్న వేవ్స్ 2025 సమ్మిట్ లో పాల్గొన్న నాగార్జునకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. పుష్ప ఉత్తరాదిలోనే బాగా ఆడిందని, దానికి కారణం ఏమనుకుంటున్నారని యాంకర్ అడిగాడు. దానికి సమాధానంగా పుష్ప లాంటి కమర్షియల్ మాస్ సినిమాలు తెలుగు ఆడియన్స్ చాలా చూశారని, కానీ హిందీ జనాలకు ఇంత మాస్ చూడటం తక్కువ కాబట్టి వాళ్లకు బాగా కనెక్ట్ అయిపోయిందని వివరించారు. నిజమేగా. అడవి రాముడు కాలం నుంచి మధ్యలో ఘరానా మొగుడు అటు తర్వాత సమరసింహారెడ్డి మొన్న అఖండ దాకా మనం క్రమం తప్పకుండా మాస్ మసాలాలు చూస్తూనే ఉంటాం.
కాబట్టే పుష్పకి ఇక్కడ ఆదరణ తీవ్ర స్థాయిలో లేదనే లాజిక్ లో పాయింట్ ఉంది. బాలీవుడ్ మేకర్స్ ఈ వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎంతసేపూ ఓటిటి, ఢిల్లీ ముంబై గుర్గావ్ లో ఉండే అర్బన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటున్నారు తప్పించి సింగల్ థియేటర్లకు మహారాజ పోషకులైన మాస్ జనాలను విస్మరిస్తున్నారు. అందుకే పుష్ప 2, గదర్ 2 లాంటివి బాక్సాఫీస్ రికార్డుల తుప్పు వదిలించాయి. జవాన్, పఠాన్ సక్సెస్ కావడం వెనుక, జాట్ వంద కోట్లు వసూలు చేయడం వెనుక కారణం ఇదే. ఇప్పటికైనా అక్కడి రైటర్స్ తమ మాస్ బుర్రలకు పదును పెడతారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates