ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్లలో అజిత్ ఒకడు. తన చివరి చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి అతను రూ.150 కోట్ల మేర పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాతి చిత్రానికి రెమ్యూనరేషన్ ఇంకా పెరగొచ్చు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి ఎదగడం అసామాన్యమైన విషయం. విశేషం ఏంటంటే.. అజిత్ నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి రాలేదట. తన తండ్రి వ్యాపారంలో నష్టపోవడం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికే ఈ రంగంలోకి వచ్చాడట. ఈ విషయాన్ని కెరీర్ ఆరంభంలో మీడియా వాళ్లు అడిగితే.. ఓపెన్‌గా చెప్పేసేవాడినని అజిత్ తెలిపాడు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే అజిత్.. తనకు పద్మభూషణ్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా తాను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానో వెల్లడించాడు అజిత్.
‘‘అసలు నాకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఏ రోజూ లేదు. నేను రేసర్ అవ్వాలని అనుకున్నా. ముందు రెండు మూడు ఉద్యోగాలు చేశాను. తర్వాత రేసింగ్ చేస్తుండగా మోడలింగ్ చేయమని కొందరు సలహాలిచ్చారు. రేసింగ్‌లోకి వెళ్లాలన్న నా ఆసక్తిని గమనించిన నా తల్లిదండ్రులు.. అందుకు తగ్గ ఆర్థిక స్థోమత మనకు లేదని చెప్పారు. తర్వాత సినీ రంగంలోకి వెళ్తానంటే అప్పుడూ కంగారు పడ్డారు. ఎలాగోలా అనుకోకుండా నటుడినయ్యా.
నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నా. మొదట్లో నా నటన ఘోరంగా ఉండేది. కెరీర్ తొలినాళ్లలో నేను చేసిన సినిమాలకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పేవాళ్లు. ఆ తర్వాత కఠోర సాధనతో నన్ను నేను చాలా మెరుగుపరుచుకున్నా. కెరీర్ ఆరంభంలో ఎవరైనా మీరెందుకు సినిమాల్లోకి వచ్చారని అడిగితే.. నిజాయితీగా సమాధానం చెప్పేవాడిని. ‘మా కుటుంబానికి వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి ఇండస్ట్రీలోకి వచ్చా’ అని చెప్పేసేవాడిని. డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చావా అని వాళ్లు రెట్టించి అడిగితే.. నేను నిజాయితీగా సమాధానం చెప్పినందుకు అభినందించమని అనేవాడిని’’ అని అజిత్ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates