తెలుగమ్మాయి దశ తిరగబోతోందా?

నిన్నటి తరం తెలుగు నటుడు రాజేష్ తనయురాలు ఐశ్వర్యా రాజేష్ తమిళంలో చాలామంచి పేరే సంపాదించింది. తండ్రి మరణానంతరం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య కుటుంబం.. అతి కష్టం మీద నిలదొక్కుకుంది. తాను కుటుంబాన్ని పోషించడానికి యుక్త వయసులో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడమే కాక సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఎంతో కష్టపడ్డట్లు ఓ ఈవెంట్లో ఐశ్వర్య వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

20 ఏళ్లకు అటు ఇటుగా వయసున్న సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా ‘కాకా ముట్టై’లో డీగ్లామరస్ రోల్ చేసి వారెవా అనిపించింది. అక్కడి నుంచి మొదలుపెట్టి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ కథానాయికగా నిలదొక్కుకుంది. ‘కనా’ పేరుతో ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ మధ్యే ‘భూమిక’ పేరుతో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టింది ఐశ్వర్యా రాజేష్.

ఐతే తెలుగులో ఐశ్వర్య నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రాలు మాత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం.. ఆమెకు ఇక్కడ మంచి అవకాశాలే దక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో పెద్ద హీరోల సరసన ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తోంది. అందులో ఒకటి.. ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు జోడీగా కొంత సమయం ఐశ్వర్య కనిపిస్తుందని అంటున్నారు. ఈ వార్త ప్రచారంలో ఉండగానే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు జోడీగా ఐశ్వర్య అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’లో పవన్ సరసన ఆమె నటిస్తుందని అంటున్నారు. ముందు ఈ పాత్రకు సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ ఆమె ఆ పాత్రకు ఓకే చెప్పలేదంటున్నారు. సాయిపల్లవికి రీమేక్‌ల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం అందుక్కారణం.

ఐతే మంచి నటి అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది కాబట్టి ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఆమె ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఒరిజినల్ చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. నిజంగా ఈ రెండు సినిమాల్లో ఐశ్వర్య నటించబోతున్నట్లయితే ఆమె దశ తిరగనున్నట్లే.