ఇంకో వారం రోజుల్లో నాని కొత్త చిత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా రిలీజ్‌కు రెడీ చేసేలోపే ఇంకో సినిమాకు రంగం సిద్ధం చేయడం నానికి అలవాటు. తన సినిమాల రిలీజ్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సినిమా మొదలవుతున్నపుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తుంటారు. నాని తన తర్వాతి చిత్రాన్ని తనకు ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ కూడా ఖరారైంది. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే దీన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్ రిలీజ్ టైంలోనే ప్రకటించింది చిత్ర బృందం.
ఐతే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సినిమా టీజర్లో కూడా అదే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ముందు డేట్ ఇచ్చిందేమో నాని టీం. కానీ చరణ్ సినిమాకు ఆ డేట్ తీసుకున్నారంటే నాని చిత్రం రావడం కష్టం. మరి ఈ క్లాష్ సంగతి ఏంటి అని నానిని ‘హిట్-3’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ‘‘మేం ఆ డేట్‌కు రావాలని పట్టుదలతో ఉన్నాం. సిన్సియర్‌గా ఆ దిశగా పని చేయబోతున్నాం. ప్రస్తుతానికి ఆ డేట్‌నే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగబోతున్నాం.
ఐతే మా సినిమా, చరణ్ సినిమా షెడ్యూళ్లు అనుకున్నట్లుగా సాగాలి. రెండూ సినిమాలూ అనుకున్న సమయానికి పూర్తయి అదే డేట్‌కు రావాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్నది చర్చించుకుంటాం. ఈ చిత్రానికి నిర్మాత నేను కాదు కాబట్టి రిలీజ్ డేట్ నేను డిసైడ్ చేయలేను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రెండు చిత్రాలూ అదే డేట్‌కు వచ్చినా ఇబ్బంది లేకపోవచ్చు. రెండు సినిమాలూ బాగానే ఆడాలని కోరుకుంటాం. సంక్రాంతికి ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు వస్తాయి. బాగుంటే అన్నీ బాగా ఆడతాయి. అలాగే సమ్మర్ సీజన్ ఆరంభంలో రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. మేమైతే ఆ డేట్ టార్గెట్‌గా ముందుకు వెళ్లబోతున్నాం’’ అని నాని తెలిపాడు.