2023 సంక్రాంతి – 2026 మళ్ళీ రిపీట్

ఏడాది పొడవునా ఎన్ని సీజన్లు ఉన్నా సంక్రాంతికి తలపడే సినిమాల యుద్ధం వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల కమర్షియల్ క్లాష్ సృష్టించే వసూళ్ల సునామి బయ్యర్ల గల్లాపెట్టెలు నింపేలా చేస్తుంది. అందుకే సంవత్సరం ముందే డేట్లు లాక్ చేసుకునే సంప్రదాయం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2026 కూడా దానికి వేదిక కానుంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాటిలో చిరంజీవి – అనిల్ రావిపూడి మొదటిది కాగా విజయ్ ‘జన నాయగన్’ అఫీషియల్ గా ఆ మధ్యే ప్రకటించేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ రావడం కొంచెం అనుమానంగానే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి.

తాజాగా ‘అఖండ 2 తాండవం’ కూడా సంక్రాంతికి రావాలనే ఆలోచన చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం కావడంతో హడావిడిగా పరుగులు పెట్టడం వద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే టీమ్ చెప్పేదాకా నిర్ధారణ చేయలేం కానీ దాదాపు పక్కానే. ఇదే నిజమైతే బాలకృష్ణ అభిమానులకు పండగే. తమ హీరోకు బాగా ఇష్టమైన కలిసొచ్చిన పండగకు అఖండ 2 తాండవం వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.

ఇక కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2023లో ఇదే తరహా క్లాష్ జరగడం గుర్తు చేసుకోవాలి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నువ్వా నేనాని తలపడ్డాయి. రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ వసూళ్ల పరంగా చిరంజీవిది పై చేయి అయ్యింది. వీటిని నిర్మించిన మైత్రికి లాభాల పంట పండింది. అదే సమయంలో విజయ్ వారసుడు కూడా వచ్చింది. తమిళ వెర్షన్ కన్నా రెండు రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా ఇక్కడేం అద్భుతాలు చేయలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా రాబట్టింది. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత చిరంజీవి, బాలయ్య, విజయ్ ఈ ముగ్గురూ సంక్రాంతి బరిలో నిలవడం విశేషమే.