సర్ప్రైజ్ : ఛావాకు పోటీ ఇస్తున్న కోర్ట్

కొత్త సినిమాలకు ఇప్పుడు థియేటర్లనే కాదు ఓటిటి వ్యూస్ లోనూ పోలికలు వస్తున్నాయి.  కాకపోతే కొన్నిసార్లు ఈ ఫలితాలు ఊహించని విధంగా అనూహ్యంగా ఉంటాయి. ఇటీవలే ఏప్రిల్ 14న ఛావా, కోర్ట్ రెండూ ఒకేరోజు ఒకే నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫార్మ్ మీద స్ట్రీమింగ్ కి వచ్చాయి. బడ్జెట్, క్యాస్టింగ్, కంటెంట్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే మొదటి వీకెండ్ లో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఛావా 5.9 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోగా కోర్ట్ దానికి ధీటుగా 5.4 మిలియన్ల వ్యూస్ తో గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ నెంబర్లలో అనూహ్య మార్పులు జరిగి నిర్మాత నాని సినిమానే నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యం లేదు.

రెండు సినిమాలు మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి. కాకపోతే ఛావాకు థియేట్రికల్ గా అంత భారీ స్పందన వచ్చినప్పుడు ఓటిటిలో అంతకు మించి వస్తుందని ఫ్యాన్స్ ఆశించడం సహజం. కానీ దానికి భిన్నంగా తక్కువ అంకెలు నమోదు కావడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఛావా 50 రోజుల తర్వాత డిజిటల్ బాట పట్టేసింది. అప్పటి దాకా ఓపిక పట్టలేని చాలా మంది లీకైన హెచ్డి ప్రింట్ లో పని కానిచ్చేశారు. కానీ కోర్ట్ అలా కాదు. కేవలం 28 రోజుల విండోతో ఓటిటికి వచ్చింది. సహజంగానే థియేటర్ కు వెళ్లని వాళ్ళు అధిక సంఖ్యలో ఉండటంతో దీనికి ప్రాధాన్యం ఇస్తున్న వైనం కనిపిస్తోంది.

ఈ కారణంగానే ఓటిటి నిర్మాతల మీద తక్కువ గ్యాప్ కోసం ఒత్తిడి తెస్తాయి. కావాలనే అధిక మొత్తాలను ఆఫర్ చేస్తాయి. ఇక కోర్ట్ విషయానికి వస్తే స్ట్రీమింగ్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంది. నిర్మాతగా నాని బ్రాండ్ మరింత పెరిగేందుకు ఇది దోహద పడుతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ న్యాచురల్ స్టార్ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. తను హీరోగా నటించినా, ప్రొడ్యూసర్ గా వ్యవహరించినా వెంటనే కొనేందుకు పోటీ పడుతోంది. దసరా నుంచి మొదలైన ఈ బంధం తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో ఇంకా బలపడి ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ తో కొనసాగుతోంది. నాని బ్రాండ్ అలాంటిది మరి.