మెగాస్టార్ చిరంజీవిలోని బహుముఖ ప్రజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల సంగతలా వదిలేస్తే ఆయన వంట పని, ఇంటి పని బాగా చేస్తారు. ముఖ్యంగా చిరు వంట ప్రావీణ్యం గురించి చెప్పడానికి చాలానే ఉంది. కర్ణాటకలో ఎప్పుడో షూటింగ్ సందర్భంగా చూసిన ఒక దోసె నచ్చి దానికి తన నైపుణ్యం కూడా జోడించి సరికొత్త దోసె తయారు చేస్తే ఒక ప్రఖ్యాత హోటల్లో అది ఒక స్పెషల్ వంటకంగా మారడం విశేషం.
ఇక కరోనా-లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న సమయంలో చిరు ఒకసారి తన స్పెషల్ దోసె, మరోసారి చేపల ఫ్రై చేసి అందరినీ అలరించాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత చిరు మరోసారి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈసారి చిరు మోడర్న్ చెఫ్ అవతారం ఎత్తారు. ఈ తరం పిల్లలకు బాగా నచ్చే కేఎఫ్‌సీ టైప్ ఫ్రైడ్ చికెన్ ట్రై చేశారు. తన ఇద్దరు మనవరాళ్లు సంహిత, నివృతిల కోసం ఆయనీ వంటకం చేశారు. వాళ్లిద్దరూ కేఎఫ్‌సీ చికెన్ తినాలని ఆశపడితే.. బయట తిండి ఈ టైంలో అంత మంచిది కాదంటూ చిరు తనే ఆ తరహా ఫ్రైడ్ చికెన్ చేయడానికి నడుం బిగించారు.
ఐతే అన్నీ తనే చేయకుండా ఆ పిల్లలిద్దరితోనే ఇందుకు అవసరమైన పదార్థాలన్నీ రెడీ చేయించి.. కాంబినేషన్లు చెప్పి.. చివరగా ఆయిల్‌లోకి చికెన్ వేసి ఫ్రై చేసి బయటికి తీసి పిల్లలకు వడ్డించారు. దీనికి చిరు కామెంట్రీ బాగా ఆకట్టుకుంది. ఆయన చేయించిన చికెన్ తిన్న మనవరాళ్లు కేఎఫ్‌సీలో కంటే ఇది ఇంకా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం.